English | Telugu

‘జగదేక వీరుడు..’ని గుర్తు చేస్తూ.. 34 ఏళ్ల తర్వాత ఆ ముగ్గురూ మెగాస్టార్‌ని కలిశారు!

తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్‌ ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం షూటింగ్‌ లొకేషన్‌కి వచ్చి చిరును కలుసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. అజిత్‌ భార్య షాలిని కూడా తమ ఫోటోను పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో చాలా ప్రత్యేకమైనది అని చూసిన వారందరూ చెబుతున్నారు. ముఖ్యంగా అభిమానులు ఈ ఫోటోను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

షాలిని ఫోస్ట్‌ చేసిన ఫోటోలో చిరంజీవి, షాలిని, షామిలి, రిషి ఉన్నారు. ఈ ముగ్గురూ సోదరసోదరీమణులు అనే విషయం అందరికీ తెలిసిందే చిన్నతనం నుంచే సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరో విశేషం ఏమిటంటే.. 1990లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో ఈ ముగ్గురూ నటించారు. ఈ సినిమా విడుదలై 34 సంవత్సరాలు అవుతోంది. ఒక సందర్భంలో ఈ ముగ్గురూ మెగాస్టార్‌ చిరంజీవిని కలుసుకున్నారు. చిరుతో తమకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. చిరంజీవి కూడా వారిని ఎంతో ఆత్మీయంగా పలకరించారు. మెగాస్టార్‌ని ఇలా ముగ్గురం కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మొదట బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన షాలిని ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా నటించింది. మణిరత్నం రూపొందించిన దృశ్యకావ్యం ‘సఖి’ చిత్రంలో షాలిని హీరోయిన్‌గా మెరిసింది. ఇక షామిలి కూడా బాలనటిగానే వచ్చి ఆ తర్వాత ‘ఓయ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా అందర్నీ మెప్పించింది. రిషి సౌత్‌లోని భాషల్లో కొన్ని సినిమాలు చేసి విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.