English | Telugu

కొవిడ్‌తో మాలాశ్రీ భ‌ర్త‌, క‌న్న‌డ నిర్మాత రాము క‌న్నుమూత‌

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన ఒక‌ప్ప‌టి గ్లామ‌ర‌స్ హీరోయిన్ మాలాశ్రీ భ‌ర్త‌, క‌న్న‌డ సినీ నిర్మాత రాము కొవిడ్‌-19తో పోరాడుతూ బెంగ‌ళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో ఈరోజు ఆక‌స్మికంగా మృతి చెందారు. ఆయ‌న వ‌య‌సు 52 సంవ‌త్స‌రాలు. ఆయ‌న 37 సినిమాలు నిర్మించారు. వాటిలో ఏకే47, లాకప్ డెత్‌, సీబీఐ దుర్గ‌, క‌ల‌సిపాల్య లాంటి హిట్ సినిమాలున్నాయి. రూ. కోటి పైగా బ‌డ్జెట్‌తో సినిమాని నిర్మించిన తొలి క‌న్న‌డ నిర్మాత‌గా పేరుపొందిన ఆయ‌న‌కు 'కోటి రాము' అనేది నిక్ నేమ్‌గా మారింది.

కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో బెంగ‌ళూరులోని ఎం.ఎస్‌. రామ‌య్య హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ అక్క‌డే ఆయ‌న చివ‌రి శ్వాస విడిచారు. రాము, మాలాజీ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. క‌న్న‌డ చిత్ర‌సీమ‌లోని మోస్ట్ పాపుల‌ర్ యాక్ష‌న్ మూవీస్‌లో కొన్ని రాము, మాలాజీ కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి. రాము మృతితో క‌న్న‌డ చిత్ర‌సీమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

మూడు ద‌శాబ్దాల కాలంగా త‌మ‌కు స‌న్నిహితంగా మెలిగిన‌, త‌న సినిమాల‌తో అనేక మందికి ఉపాధి కల్పించిన ప్ర‌ముఖ నిర్మాత క‌న్నుమూయ‌డాన్ని జీర్జించుకోలేక‌పోతున్నామ‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు. సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.