English | Telugu
హీరో సూర్య రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు..!
Updated : Apr 5, 2016
రోడ్డుపై మనిషి ప్రమాదంలో ఉంటే, మనకెందుకులే అని వెళ్లిపోతున్నారు చాలా మంది. కారులో రక్తం మరకలౌతాయని భయపడేవాళ్లు మరికొంత మంది. మనిషి ప్రాణమంటే విలువ లేని ఇలాంటి కాలంలో, మానవత్వంతో తాను రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని నిరూపించుకున్నాడు హీరో సూర్య. ప్రమాదంలో గాయపడి రోడ్డు మీద పడివున్న మహిళను తన కారులో హాస్పిటల్ కు చేర్చాడు. ఈ సంఘటన మన రాష్ట్రంలోని మదనపల్లె సమీపంలో జరిగింది. విషయంలోకి వెళ్తే, సూర్య లేటెస్ట్ సినిమా ' 24 ' షూటింగ్ చిత్తూరు జిల్లా మదనపల్లె మండంలోని ఈడిగపల్లెలో జరుగుతోంది.
ఇక్కడికి దగ్గర్లో ఉన్న క్వారీలో షూటింగ్ ను పూర్తి చేసుకుని, రాత్రి తొమ్మిది గంటల సమయంలో సూర్య మదనపల్లెకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి ఉన్న మహిళను చూసిన సూర్య, ఆమెను తన కారులో ఎక్కించుకుని టౌన్ లోని హాస్పిటల్ కు చేర్చాడు. తాను హోటల్ కు చేరుకున్న తర్వాత కూడా, ఆమె పరిస్థితి ఎలా ఉందంటూ ఆరా తీశాడట. దీంతో స్థానికులు సూర్య దాతృత్వానికి ఆశ్చర్యపోతున్నారు. దగ్గరగా ఈ సంఘటనను చూసిన వారంతా, సూర్య నిజజీవితంలో కూడా హీరోయే అంటూ పొగుడుతున్నారు. నిజమే మరి. ఈ కాలంలో తోటి మనిషికి సాయం చేయడం కూడా గొప్ప విషయమే..! ఇప్పటికే సూర్య అగరం అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తూ, పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు. మనం సంపాదించుకుంటే చాలు, ఎవరెలా పోతే మనకెందుకులే అనుకునే ఇలాంటి కాలంలో సూర్య లాంటి మంచి మనసున్న హీరోకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!