English | Telugu

'గాలోడు' మూవీ రివ్యూ

సినిమా పేరు: గాలోడు
తారాగణం: సుడిగాలి సుధీర్, గెహన సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్, పృథ్వీ, సత్య కృష్ణ
సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్
ఎడిటర్: ఎంఎస్ఆర్
నిర్మాత: రాజశేఖర్ రెడ్డి
దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి
బ్యానర్: సంస్కృతి ఫిలిమ్స్
విడుదల తేదీ: నవంబర్ 18, 2022

బుల్లితెరపై తనదైన శైలిలో వినోదాన్ని పంచుతూ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్.. వెండితెరపై కూడా రాణించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే 'సాఫ్ట్ వేర్ సుధీర్', 'త్రీ మంకీస్', 'వాంటెడ్ పండుగాడ్' వంటి సినిమాలు చేశాడు గానీ అవేవి కనీస ఆదరణకు కూడా నోచుకోలేకపోయాయి. ఈ క్రమంలో 'గాలోడు' అనే పక్కా మాస్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కామెడీ ఇమేజ్ ఉన్న సుధీర్ మాస్ పాత్రలో మెప్పించాడా? వెండితెరపై రాణించాలని ఆశపడుతున్న సుధీర్ కి 'గాలోడు' చిత్రమైనా విజయ బాటలు వేసేలా ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:
రజినీకాంత్ అలియాస్ గాలోడు(సుధీర్) ఊళ్ళో పనిపాట లేకుండా కొట్లాటలు, పేకాటతో కాలం వెళ్లదీసే ఆకతాయి కుర్రాడు. అందుకే అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తాడు. ఒకసారి పేకాటలో జరిగిన వివాదంలో గాలోడు కొట్టిన దెబ్బలకి ఆ ఊరి సర్పంచ్ కొడుకు చనిపోతాడు. దీంతో తనని పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఊరు వదిలి హైదరాబాద్ కి పారిపోతాడు గాలోడు. తెలిసినవాళ్ళు ఎవరూ లేక, తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్న గాలోడుకి అనుకోకుండా శుక్ల(గెహన సిప్పీ) పరిచయమవుతుంది. ఆమె రాకతో గాలోడి జీవితంలో వచ్చిన మార్పేంటి? ఆమె తండ్రి గాలోడిని ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు సర్పంచ్ కొడుకు హత్య కేసు నుంచి గాలోడు బయటపడగలిగాడా? అనేది మిగతా కథ.

విశ్లేషణ:
మాస్ ప్రేక్షకులను మెప్పించడానికి నాలుగు పంచ్ డైలాగ్లు, ఐదు ఫైట్లు, ఆరు పాటలు, కొన్ని బిల్డప్ షాట్లు చాలు అనే భ్రమల్లో కొందరు ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. అలాంటి భ్రమల్లో ఉండి తీసిన సినిమానే 'గాలోడు'. షార్ట్ ఫిల్మ్ కి సరిపోయేంత ఒక చిన్న రొటీన్ స్టోరీని తీసుకొని, దానిని అంతకంటే రొటీన్ గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు రాజశేఖర్ రెడ్డి. కథాకథనాలు బాగుండి వాటికి తగ్గట్టుగా డైలాగ్లు, ఫైట్లు, పాటలు తోడైతేనే మాస్ ప్రేక్షకులైనా ఆదరిస్తారు.

హత్య కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా సుధీర్ పరిచయంతో సినిమా కాస్త ఆసక్తికరంగానే మొదలవుతుంది. కానీ ఆ తర్వాతే ఎటెటో వెళ్తూ సినిమా పూర్తిగా గాడి తప్పింది. మాస్ సినిమా అనగానే హీరోకి కొన్ని బిల్డప్ షాట్లు ఉండాలి, అవసరంలేని చోట కూడా డైలాగులు చెప్పించాలన్నా ఆలోచనే తప్ప.. కథాకథనాల మీద దృష్టి పెట్టి ఈ సినిమా తీసినట్టు ఒక్క చోట కూడా అనిపించదు. రచయితగా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ఒక్క సన్నివేశం కూడా కొత్తగా అనిపించదు. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా లేవు. బాగా డబ్బున్న అమ్మాయి డబ్బుల్లేని ఆవారా ప్రేమలో పడటం, వాళ్ళని విడతీయడానికి అమ్మాయి తండ్రి ప్రయత్నించడం వంటి సన్నివేశాలు చూసి ఏ కాలం నాటి సినిమా చూస్తున్నాం అనిపించింది. సినిమాలో అసందర్భ సన్నివేశాలు, అసందర్భ సంభాషణలు బోలెడున్నాయి. కొన్ని కొన్ని డైలాగ్స్ బాగున్నా అవి సన్నివేశానికి తగ్గట్టుగా లేవు.

కొన్ని సన్నివేశాలను అవసరంలేకపోయినా గ్రీన్ మ్యాట్ లో చిత్రీకరించారు. వీఎఫ్ఎక్స్ మరీ పేలవంగా ఉంది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పర్లేదు. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. కానీ భీమ్స్‌ సిసిరోలియో సంగీతం తేలిపోయింది. ఒక్క పాట కూడా గుర్తు పెట్టుకొని పాడుకునేలా లేదు. సన్నివేశాల్లో పస లేకపోవడంతో నేపథ్య సంగీతంతో కూడా మ్యాజిక్ చేయలేకపోయాడు. సినిమా నిడివి 2 గంటలే ఉన్నప్పటికీ ల్యాగ్ అనిపించింది అంటే అది ఎడిటర్ ఎంఎస్ఆర్ తప్పుకాదు. ట్రిమ్ చేసుకుంటూ పొతే షార్ట్ ఫిల్మ్ అవుతుంది.

నటీనటుల పనితీరు:
సుధీర్ తనని తాను మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి బాగానే కష్టపడ్డాడు. ఫైట్స్, డ్యాన్స్ లతో అదరగొట్టాడు. అయితే యాక్టింగ్ లో ఇంకా మెరుగుపడాలి. ముఖ్యంగా కథల ఎంపికలో చాలా చాలా మెరుగుపడాలి. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు చేయాలి. ఇలాంటి రొటీన్ సినిమాలు చేసుకుంటూ పోతే వెండితెరపై రాణించాలన్న అతని ఆశ ఎప్పటికీ నెరవేరదు. బుల్లితెర నుంచి వచ్చిన తమిళ హీరోలు విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ స్టార్స్ అయ్యారంటే.. కథలు, పాత్రల ఎంపికలో వాళ్ళు చూపించిన వైవిద్యం అని తెలుసుకోవాలి. గెహన సిప్పీ తన అందం, అభినయంతో ఉన్నంతలో మెప్పించే ప్రయత్నం చేసింది. రిచ్ బెగ్గర్ గా సప్తగిరి, వంటవాడిగా షకలక శంకర్ అంతో ఇంతో నవ్వించే ప్రయత్నం చేశారు.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కథాకథనాలతో పెద్దగా పనిలేదు. నాలుగు ఫైట్లు, ఐదు పాటలు, కొన్ని పంచ్ డైలాగ్ లు ఉంటే చాలు అనుకున్నవాళ్ళు నిరభ్యంతరంగా ఈ సినిమాకి వెళ్లొచ్చు.

రేటింగ్: 2/5

-గంగసాని