English | Telugu
క్రికెట్ నుంచి క్యాబరే కు మారిన క్రికెటర్ శ్రీశాంత్
Updated : Mar 22, 2016
క్రికెట్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన శ్రీశాంత్ కెరీర్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో దాదాపు ఎండ్ అయిపోయింది. కానీ క్రీడకు దూరమైనా, ప్రజలకు మాత్రం దూరం కాలేదు శ్రీశాంత్. కేవలం క్రికెటర్ మాత్రమే కాక, అతను ఒక అద్భుతమైన డ్యాన్సర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే అతని డ్యాన్స్ ను, జనాల్లో అతని పేరుకున్న క్రేజ్ ను వాడుకుని సినిమాలు తీస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. తాజాగా శ్రీశాంత్ క్యాబరే (cabaret) అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. మహేష్ భట్ కూతురు పూజా భట్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
డ్యాన్స్ నేపథ్యంలో సాగే క్యాబరేలో అతనిది నెగటివ్ రోల్ అని సమాచారం. అదే కాకుండా తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో సానాయాదిరెడ్డి రూపొందిస్తున్న ఒక సినిమాలో హీరోగా చేస్తున్నాడు. క్రికెటర్ గా మారాలనుకునే ఒక కుర్రాడు, హీరోయిన్ తో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కథతో ఈ సినిమా రూపొందుతోంది. క్రికెటర్ గా 33 ఏళ్ల శ్రీశాంత్ కెరీర్ దాదాపు చివరికి వచ్చేసినట్టే. అందుకే తనమీద ఉన్న కాంట్రవర్సీలను ఇలా సినిమాలకు ఉపయోగపడేలా మార్చుకుంటున్నాడీ ఫాస్ట్ బౌలర్. మళ్లీ తను క్రికెట్ లోకి వస్తానని ఆశాభావంతో ఉన్న శ్రీశాంత్, 2019 వరల్డ్ కప్ ఆడటమే తన లక్ష్యమంటున్నాడు. మరి శ్రీశాంత్ లక్ష్యం నెరవేరుతుందో లేదో, కాలమే సమాధానం చెప్పాలి.