English | Telugu
పుట్టిన రోజున అలియా భట్ ను ఏడిపించిన అమ్మమ్మ
Updated : Mar 22, 2016
కపూర్ అండ్ సన్స్ భారీ హిట్ కొట్టిన ఊపులో ఉంది అలియాభట్. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ 23 ఏళ్ల హీరోయిన్ కు మంచి డిమాండ్ ఉంది. తాజాగా తన పుట్టిన రోజుకు అలియాను ఆమె తాతయ్య అమ్మమ్మ ఏడిపించారు. బాధతో కాదులెండి. వాళ్లిద్దరూ కలిసి అలియాకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చి ఆమెకు హ్యాపీ టియర్స్ తెప్పించేశారు. హ్యాపీ బర్త్ డే ట్యూన్ ను ఆమె తాతయ్య వయొలిన్ వాయిస్తే, అమ్మమ్మ మౌత్ ఆర్గాన్ వాయించడమే ఆ గిఫ్ట్. మహేష్ భట్ రెండో భార్య సోనీ రజ్దాన్ కూతురు అలియా భట్. అలియా అమ్మమ్మ జర్మనీ దేశస్థురాలు. తాతయ్య కాశ్మీరీ పండిట్.
తన పుట్టిన రోజుకు వాళ్ల వద్దకు వెళ్లిన అలియాకు ఈ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో అలియా ఎమోషనల్ అయిపోయింది. ఆమె అక్క పూజా భట్ ఈ తతంగం మొత్తాన్ని వీడియోలో బంధించింది. భట్ కుటుంబంలో ఎప్పుడూ కన్నీళ్లు లేవని కాదు గానీ, ఈ కన్నీళ్లు మాత్రం చాలా స్పెషల్ అంటూ తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది పూజా భట్. విచిత్రమేంటంటే, అలియా లేటెస్ట్ సినిమా కపూర్ అండ్ సన్స్ లో కూడా హీరోలిద్దరూ ఇలాగే తమ తాతయ్య ఇంటికి వెకేషన్ కు వెళ్తారు. అక్కడే బంధాల విలువ తెలసుకుంటారు. అలియా బంధం విలువ తెలుసుకుందో లేదో తెలీదు గానీ, పుట్టినరోజును మాత్రం ఫుల్ గా ఎంజాయ్ అయితే చేసిందిలెండి.