English | Telugu
తన పుట్టినరోజున థియేటర్లలో సందడి చేయనున్న ప్రభాస్
Updated : Oct 18, 2023
హీరోగా ప్రభాస్ కెరీర్‌ని టర్న్ చేసిన సినిమా, అతన్ని స్టార్ హీరో చేసిన సినిమా ‘ఛత్రపతి’. ప్రభాస్, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2005లో విడుదలై ప్రభంజనం సృష్టించింది. హీరోయిజం అంటే ఎలా ఉంటుందో, హీరో రేంజ్ ఏమిటో చూపించిన సినిమా ఇది. 2005 నుంచి ఇప్పటివరకు ఈ సినిమా టీవీలో కొన్ని వందల సార్లు వచ్చి ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమాకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. 18 సంవత్సరాల తర్వాత ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించడానికి వచ్చేస్తోంది.
ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. రెబల్‌స్టార్ పుట్టినరోజు సందర్భంగా ‘ఛత్రపతి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 4కె వెర్షన్‌లో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లలో ఎలాంటి హంగామా ఉంటుందో, అభిమానులు ఎంత హడావిడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ప్రభాస్ సరసన హీరోయిన్‌గా శ్రీయాశరన్ నటించిన సినిమాలో భానుప్రియ, ప్రదీప్‌రావత్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, అజయ్, షఫి, ఎల్‌బి శ్రీరామ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.