English | Telugu

రూహి మృతితో ఎమోషనల్‌ అయిపోయిన ఛార్మి, మంచు లక్ష్మీ!

ఇటీవలికాలంలో సినిమా ఇండస్ట్రీని విషాద వార్తలు వెంటాడుతున్నాయి. గత కొంతకాలంగా ఎవరో ఒకరు మృతి చెందడమో లేదా అనారోగ్యానికి గురి కావడమో జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.కె.సెంథిల్‌కుమార్‌ సతీమణి ఆండ్రూహి అనారోగ్య కారణాలతో గురువారం తుదిశ్వాస విడిచారు. యోగా ట్రైనర్‌గా సినీ ప్రముఖులందరికీ ఆమె సుపరిచితమే. సినిమా రంగానికి చెందిన పలువురు ఆమె వద్ద యోగా నేర్చుకుంటున్నారు. రూహి హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. రూహితో ఎంతో సానిహిత్యం ఉన్న ఛార్మి, మంచు లక్ష్మీ ఎంతో కలత చెందారు. ఆమెతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

‘నీ గురించి ఇలాంటి పోస్ట్‌ చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు మై డియర్‌ రూహి.. నాకు మాటలు రావడం లేదు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. ఈ వార్త నిజం కాకూడదని కోరుకుంటున్నాను. మనం చివరి సారి కలుసుకున్నప్పుడు కూడా ఎంతో సరదాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకున్నాం. మనిద్దరిదీ 18 ఏళ్ళ అనుబంధం. ఇక నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతాను. నీ ఆత్మకు శాంతి కలగాలని, నీ కుటుంబానికి ఆ దేవుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎంతో ఎమోషనల్‌గా ట్వీట్‌ చేసింది ఛార్మి.

‘నువ్వు పంపిన చివరి మెసెజ్‌ ఇదే రూహి.. నేను ఆమెను ప్రతీ వారం జిమ్‌లో కలుస్తుంటాను.. ఆమె చిరునవ్వు, ఎనర్జీ ప్రత్యేకం. మేం ఇద్దరం మా కాళ్లు నొప్పులు పుట్టే వరకు, బట్టలు తడిసే వరకు డ్యాన్స్‌ చేసేవాళ్లం, దవడలు నొప్పి పుట్టే వరకు నవ్వేవాళ్లం.. ఏదీ శాశ్వతం కాదని మళ్లీ నువ్వు నిరూపించావ్‌.. ఇలా నువ్వు వదిలి వెళ్లడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు అనిపిస్తోంది’ అంటూ రూహి తనకు పెట్టిన చివరి మెసేజ్‌ను చూపించింది మంచు లక్ష్మీ.