English | Telugu

‘కీడాకోలా’ యూనిట్‌కి లీగల్‌ నోటీసులు పంపిన చరణ్‌.. అసలేం జరిగింది?

రోజురోజుకీ పెరుగుతున్న టెక్నాలజీతో దేశంలో ఎలాంటి వింతలు, విడ్డూరాలు క్రియేట్‌ చేస్తున్నారో మనం చూస్తున్నాం. టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతే చేటు కూడా ఉంది. ఇటీవల జరిగిన చాలా ఘటనలు దాన్ని ప్రూవ్‌ చేశాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. దీంతో ఏవైనా చెయ్యొచ్చు అనేది స్పష్టంగా తెలుస్తోంది. మనం చూస్తున్నది నిజమేనని భ్రమించేలా ఎఐను డెవలప్‌ చేశారు. ఇటీవల శోభన్‌బాబుని క్రియేట్‌ చేయడం పెద్ద సంచలనంగా మారింది. అయితే దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకపోవడం వల్ల అందరూ శోభన్‌బాబుని మళ్లీ చూసి ఎంజాయ్‌ చేశారు. ఇక హీరోయిన్ల ఫేస్‌ని మార్చి అసభ్యకర వీడియోలు చేయడం వల్లే ఈ టెక్నాలజీపై అందరికీ ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి సింగర్స్‌ వాయిస్‌ను కూడా ఎఐ సాయంతో క్రియేట్‌ చేస్తున్నారు. మరణించిన వారి వాయిస్‌ను రీ క్రియేట్‌ చెయ్యడం అనేది ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. కీడాకోలా చిత్రంలో ఎస్‌.పి.బాలు వాయిస్‌ను రీ క్రియేట్‌ చేసి వాడుకున్నారు. ఈ చర్యపై ఆయన తనయుడు ఎస్‌.పి.చరణ్‌ సీరియస్‌ అవుతున్నారు.

తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన కీడాకోలా చిత్రం గత ఏడాది విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాలోని ఒక సీన్‌లో వచ్చే ‘స్వాతిలో ముత్యమంత..’ పాటకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్‌.పి.బాలు ఈ పాటను పాడారు. కీడాకోలాలో వచ్చిన పాటలో ఉన్న వాయిస్‌ బాలుదే అనుకున్నారందరూ. కానీ, ఎఐ సాయంతో బాలు వాయిస్‌ని రీక్రియేట్‌ చేసామని తరుణ్‌ భాస్కర్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విషయం తెలుసుకున్న బాలు తనయుడు ఎస్‌.పి.చరణ్‌ ఆ చిత్ర యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఆయన స్వరానికి మళ్ళీ జీవం పోయడం అనేది మెచ్చుకోవాల్సిన విషయమే. కానీ, ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకురాకుండా, మా అనుమతి తీసుకోకుండా ఇలాంటి చర్యకు పాల్పడడం మాకు బాధ కలిగించిందని అన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కీడాకోలా యూనిట్‌ క్షమాపణలు చెప్పి, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు చరణ్‌. దీనిపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు చిత్ర యూనిట్‌కి లీగల్‌ నోటీసులు కూడా పంపినట్టు చరణ్‌ తెలిపారు.