English | Telugu

Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి.. 'SSMB 29'తో అంతకుమించిన సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలై, విడుదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.

'SSMB 29' చిత్రానికి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడం లేదట. రాజమౌళి టీంలో ఉన్న టెక్నీషియన్స్ లో కీలకమైన వారిలో సెంథిల్ ఒకరు. జక్కన్న మెజారిటీ సినిమాలకు ఆయన కెమెరా పనితనం ప్రాణం పోసింది. ఇప్పటిదాకా దర్శకధీరుడి డైరెక్షన్ లో 12 సినిమాలు వస్తే, అందులో 8 సినిమాలకు సెంథిల్ డీఓపీగా వ్యవహరించాడు. ముఖ్యంగా 'మగధీర', 'ఈగ', 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలలో సెంథిల్ కెమెరా వర్క్ కట్టిపడేసింది. అలాంటి సెంథిల్ ఇప్పుడు 'SSMB 29'కి వర్క్ చేయడంలేదు. ఆయన స్థానంలో పి.ఎస్. వినోద్ ను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నట్లు సమాచారం.

సెంథిల్ దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకే 'SSMB 29'కి పనిచేయడం లేదని తెలుస్తోంది. నిజానికి దర్శకుడిగా మారే ఆలోచన సెంథిల్ కి ఎప్పటినుంచో ఉంది.. కానీ రాజమౌళి సినిమాల కోసం దానిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఈసారి మాత్రం మెగాఫోన్ పట్టాలని బలంగా ఫిక్స్ అయ్యాడట. సెంథిల్ వర్క్ చేయకపోవడం 'SSMB 29'కి ఓ రకంగా షాక్ అనే చెప్పాలి. అయితే అక్కడుంది జక్కన్న కాబట్టి.. అవుట్ పుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా చెక్కుతాడు అనడంలో సందేహం లేదు.