English | Telugu
అమరావతిలో బాలయ్యకు చక్రవర్తిగా పట్టాభిషేకం..!
Updated : Apr 7, 2016
బాలయ్య అభిమానులకు రేపు ఉగాది పండగతో పాటు, సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాకాలంగా వందో సినిమా డిటెయిల్స్ చెబుతానంటూ ఊరిస్తున్న బాలయ్య, రేపే గుట్టు విప్పేయబోతున్నాడు. క్రిష్ డైరెక్షన్లో బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి చక్రవర్తిగా నటించబోతున్నాడు. అందరికీ తెలిసిందే అయినా, నందమూరి అందగాడు స్వయంగా చెబితేనే అభిమానుల మనస్సు స్థిమితపడుతుంది. అందుకే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, శాతకర్ణి సినిమాకు శ్రీకారం చుడదామని ఫిక్సయ్యాడట.
అమరావతిలో ఉన్న బుద్ధవిగ్రహం దగ్గర ఉగాది రోజున ముహూర్తం షాట్ చిత్రీకరించనున్నారు. ఇప్పటికే దీని కోసం స్టేజ్ ను కూడా నిర్మించారు. ఛీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాబోతున్నారు. దాదాపు 60 కోట్లకు పైగా బడ్జెట్ ఎస్టిమేషన్ తో పూర్తి స్థాయి చారిత్రాత్మకంగా తెరకెక్కబోతోంది. బాలయ్యకు అద్భుతంగా సెట్ అయినా, పూర్తి స్థాయి చారిత్రాత్మక పాత్రను ఆయన ఎప్పుడూ చేయలేదు. ఆదిత్య 369లో కాసేపు మాత్రమే కృష్ణదేవరాయలుగా కనిపించి అలరించారు. జానపదం, పౌరాణికం సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు క్రిష్ తో హిస్టారికల్ మూవీ కూడా కంప్లీట్ చేస్తే, ఈ తరంలో నటిస్తున్న హీరోల్లో, ఇన్ని జానర్లలో నటించిన ఘనత అందుకున్న ఏకైక నటుడవుతారు. ప్రస్తుతం మూహూర్తం షాట్ చిత్రీకరించి, పూర్తి స్థాయి షూటింగ్ ను మే లో మొదలుపెట్టబోతున్నారు క్రిష్ అండ్ టీం. నయనతారను గానీ, త్రిషను గానీ హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం.