English | Telugu

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను డైరెక్ట్ చేయ‌నున్న సాగ‌ర్ చంద్ర ఎవ‌రు?

మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' సినిమా తెలుగు రీమేక్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించ‌నున్నాడు. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నుంచి ద‌స‌రా సంద‌ర్భంగా ఆదివారం అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది కూడా. అయితే అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది ద‌ర్శ‌కుడి పేరు. సాగ‌ర్ కె. చంద్ర ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాంతో ఎవ‌రీ సాగ‌ర్ చంద్ర అంటూ ఫ్యాన్స్ ఆరా తీయ‌డం ప్రారంభించారు.

సాగ‌ర్ చంద్ర ఇదివ‌ర‌కు రెండు సినిమాల‌ను రూపొందించాడు. ఒక‌టి 2012లో రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టించ‌గా వ‌చ్చిన స్మాల్ బ‌డ్జెట్ ఫిల్మ్ 'అయ్యారే' కాగా, మ‌రొక‌టి.. 2016లో నారా రోహిత్‌, శ్రీ‌విష్ణుల‌తో తీసిన 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' సినిమా. నిత్యానంద స్వామి లీల‌లు వెలుగులోకి వ‌చ్చిన కాలంలో ఆయ‌న‌ను పోలిన పాత్ర‌తో సాగ‌ర్ చంద్ర రూపొందించిన 'అయ్యారే' సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. ఇక 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' సినిమా సాగ‌ర్ చంద్ర‌లోని క్రియేటివిటీని మ‌రింత‌గా ప్ర‌ద‌ర్శించింది. డైరెక్ట‌ర్ కాక‌ముందు ర‌విబాబు ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా 'అన‌సూయ‌', 'అమ‌రావ‌తి' చిత్రాల‌కు ప‌నిచేశాడు సాగ‌ర్ చంద్ర‌.

ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావ‌డం అంద‌ర్నీ స‌ర్‌ప్రైజ్‌కు గురిచేసింది. అనూహ్యంగా అత‌డి పేరు తెర‌మీద‌కు వ‌చ్చింద‌ని చెప్పాలి. 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' సినిమాని ప‌వ‌న్ క‌ల్యాణ్ చూశాడ‌నీ, డైరెక్ట‌ర్‌గా సాగ‌ర్ స్కిల్స్‌కు ఆయ‌న‌కు బాగా న‌చ్చి, ఈ అవ‌కాశం ఇచ్చాడ‌నీ వినిపిస్తోంది.

ఒరిజిన‌ల్‌లో బిజు మీన‌న్ చేసిన పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ అయ్య‌ప్ప‌న్ రోల్‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయ‌బోతున్నాడు. మాజీ హ‌వ‌ల్దార్ కోషిగా న‌టించిన పృథ్వీరాజ్ క్యారెక్ట‌ర్‌ను ఎవ‌రు చేసేదీ నిర్మాత‌లు ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఇదివ‌ర‌కు ఆ పాత్ర‌కు రానా పేరు బ‌లంగా వినిపించింది. సినిమాలో అయ్య‌ప్ప‌న్‌, కోషి క్యారెక్ట‌ర్ల‌కు స‌మాన ప్రాముఖ్యం ఉంటుంది. ఇప్పుడు అయ్య‌ప్ప‌న్ క్యారెక్ట‌ర్‌ను ఏకంగా ప‌వ‌ర్ స్టార్ చేస్తుండ‌టంతో కోషి పాత్ర‌ను ఎవ‌రు చేస్తారు, ఆ పాత్ర‌కు ఈక్వ‌ల్ ఇంపార్టెన్స్ ఉంటుందా అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.