English | Telugu

సీతమ్మ నుంచి చంద్రముఖిగా అంజలి

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తరువాత అంజలిగా కన్నా సీతగానే ఎక్కువ మందికి గుర్తుస్తోంది ఈ తెలుగింటమ్మాయి. చూడటానికి మహా అమాయకంగా ఉండే అంజలి చంద్రముఖిలా మారితే ఎలా ఉంటుంది, ఏమో అదే చూడబోతున్నామేమో గీతాంజలి చిత్రంలో. అంజలి ప్రధాన పాత్రలో, కొత్త దర్శకుడు రాజ్ కిరణ్ రూపొందిస్తున్న చిత్రం 'గీతాంజలి'. హార్రర్ అండ్ కామెడీ అంశాలతో రూపొందుతోన్న ఈ సినిమా కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో జూన్ రెండవ వారంలో విడుదలకు సిద్దమవుతున్నారు చిత్ర యూనిట్. ఇక సినిమా గురించి కోనవెంకట్ మాట్లాడుతూ, ఈ చిత్రం అంజలికి ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అవుతుందన్నారు. అనుష్కకు 'అరుంధతి'లా, జ్యోతికకు 'చంద్రముఖి'లాగా అంజలి కెరీర్ లో గీతాంజలి చిత్రం నిలిచిపోతుందన్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా చిత్ర కథనం సాగుతుందని, అలాగే తనదైన శైలిలో వినోదానికి ప్రాధాన్యముంటుందని చెప్పారు. హారర్ కామెడీ చిత్రాల్లో ఈ చిత్రం ఖచ్చితంగా స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని ఆయన చెప్పారు. ఏమైనా సీతమ్మ లాంటి అంజలిని కొత్త కోణంలో చూపించబోయే ఈ చిత్రం కోసం అభిమానులు తప్పక ఎదురుచూస్తుంటారు.