English | Telugu

చాలా గ్యాప్‌ తర్వాత మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌తో వస్తున్న శివాజీ!

చాలా గ్యాప్‌ తర్వాత మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌తో వస్తున్న శివాజీ!

నటుడు శివాజీ గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవి తరహాలో స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నేను ఫలానా క్యారెక్టరే చేస్తాను లేదా హీరోగానే నటిస్తాను అనే కండీషన్స్‌ పెట్టుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎదిగారు. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన శివాజీ ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. శివాజీ ది బాస్‌ అనిపించుకుంటున్న శివాజీ ఇప్పుడు బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనిపించుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమాలకు దూరమైన శివాజీ చాలా గ్యాప్‌ తర్వాత 90స్‌ ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ పేరుతో రూపొందిన వెబ్‌ సిరీస్‌లో కథానాయకుడిగా నటించారు. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈటీవీ విన్‌ అనే ఓటీటీలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌ను రాజశేఖర్‌ మేడారం నిర్మించారు. ఈ సిరీస్‌కి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విక్టరీ వెంకటేష్‌ రిలీజ్‌ చేశారు. 

90వ దశకంలో మధ్య తరగతి కుటుంబాలు ఎలా వుండేవి, వారి స్థితిగతులు ఏమిటి అనేది ఎంతో సహజంగా చూపించారు. భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తూ, చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని ఎలా నడిపించాడు అనేది ఎంతో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఆదిత్య. అప్పట్లో మిడిల్‌ క్లాస్‌ తండ్రి ఎలా ఉండేవాడో అలాగే శివాజీ కనిపించారు. శివాజీ భార్య వాసుకి నటించింది. ‘తొలిప్రేమ’ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ చెల్లెలుగా నటించిన వాసుకి చాలా గ్యాప్‌ తర్వాత మళ్ళీ ఈ వెబ్‌ సిరీస్‌లో కనిపిస్తోంది. జనవరి 5న ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమ్‌ అవనుంది. చాలా గ్యాప్‌ తర్వాత ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శివాజీ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌తో ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.