English | Telugu
'ఆదికేశవ' వాయిదా.. మరీ ఇంత వెనక్కా!
Updated : Aug 18, 2023
వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'ఆదికేశవ'. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జోజు జార్జ్, అపర్ణ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈరోజు(ఆగస్టు 18న) విడుదల కావాల్సి ఉంది. ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ కి వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వినిపించాయి. ఊహించినట్లుగానే ఈ సినిమా వాయిదా పడింది. సెప్టెంబర్, అక్టోబర్ కాదు.. ఏకంగా నవంబర్ కి వాయిదా పడింది.
ఆదికేశవ సినిమా విడుదల తేదీని ఆగస్ట్ 18 నుంచి నవంబర్ 10కి వాయిదా వేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవలే ఆదికేశవ చిత్రీకరణ ప్యారిస్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాటను త్వరలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తో హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా' సినిమాలతో నిరాశ పరిచాడు. ఈ క్రమంలో అతను తన నాలుగో సినిమా 'ఆదికేశవ'తో యాక్షన్ బాట పట్టాడు. మరి ఈ చిత్రం అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.