English | Telugu
ఒకప్పుడు గంజాయి స్మగ్లింగ్ చేసిన నేటి స్టార్ రైటర్!
Updated : Jan 10, 2023
ఢీ చిత్రంతో సరికొత్త మరో ఒరవడికి, కన్ఫ్యూజన్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన స్టార్ రైటర్ కోన వెంకట్. ఆ తర్వాత దానినే అందరు ఫాలో అయ్యారు. ఇక ఈయన శ్రీనువైట్ల దర్శకత్వంలో పని చేసిన చిత్రాలతో పాటు మరికొందరి దర్శకులతో కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగించారు. ఈ ట్రెండ్ ఎంతో కాలం నడిచింది. అదే తరహాలో రెడీ, కింగ్, అదుర్స్, డాన్ శీను, దూకుడు, బాద్‌షా, బలుపు వంటి ఎన్నో చిత్రాలకు కొత్త వరవడి తీసుకొని వచ్చారు. శ్రీను వైట్ల కాంబినేషన్‌లో కోనా వెంకట్ పనిచేసిన చిత్రాలు ఓ సెన్సేషన్. ఓ సరికొత్త ట్రెండ్ ని సృష్టించాయి. ఇక కోనవెంకట్ సినీ కెరీర్ స్టార్ కమెడియన్, స్వర్గీయ ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకునిగా సీనియర్ నరేష్ హీరోగా చేసిన తోకలేని పిట్ట చిత్రంతో ప్రారంభం అయింది.
ఇక ఈయన మనసు కవి ఆచార్య ఆత్రేయకు చాలాసన్నిహితుడు. వెంకటేష్ - రేవతి జంటగా సురేష్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ, కార్తీక్, శోభన జంటగా వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ అభినందన వంటి చిత్రాలకు సంభాషణలు రాసి వాటిని ఆత్రేయకు వినిపించేవారు. ఆయన రచయిత కావడానికి అక్కడే బీజం పడింది. గ్రూప్స్ పరీక్షలు రాసి పాసయ్యారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతానికి పౌరసరఫరా శాఖ అధికారిగా ఉద్యోగం వచ్చింది. కొద్దినెలలకే ఆ పనిమీదా ఆసక్తి పోయింది. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలోని ఒక మంత్రి దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చేరారు.
ఆ ఉద్యోగం దాదాపు మూడేళ్లు చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేస్తే దానికి కన్వీనర్‌గా ఎంపికయ్యారు. ఆ బాధ్యతల్లో భాగంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా సినిమా వాళ్లతో ప్రచారం చేయించేవారు. ప్రచారంలో ఆయనతో పాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నరేష్ ఉన్నారు. ఆ సమయంలో ధర్మవరపు ఆయనకొక కథ చెప్పారు. వెంకట్ దాన్ని సినిమాగా తీస్తానన్నారు. ఆ సినిమా... తోకలేనిపిట్ట. ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకుడు, హీరో నరేష్. ఆ సినిమా బాగా ఆడలేదు.అప్పటికి ఆయనకు హైదరాబాదులో ఒక అపార్ట్‌మెంట్ ఉండేది. రెండు కార్లుండేవి. ఈ సినిమా దెబ్బకి మొత్తం పోయింది. అపార్ట్‌మెంటు, కార్లు, ఆఖరుకి భార్య నగలు కూడా అమ్మేశారు. మాసాబ్‌ట్యాంక్ దగ్గర ఒకచిన్న గదిలో అద్దెకి చేరారు. అద్దె కట్టడానికీ కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో రామ్‌గోపాల్‌వర్మను కలిశారు.
రామ్‌గోపాల్ వర్మ అతనికి కాలేజీ రోజుల నుంచీ పరిచయం. అతని సలహా మేరకు బాంబే వెళ్ళి ఆయన సినిమా సత్యకు పనిచేశారు. సంభాషణల రచయితగా అది తొలిమెట్టు. ఆ సినిమా సంభాషణలను చెన్నైలో దర్శకుడు మణిరత్నం విని తన 'దిల్ సే' తెలుగు అనువాదానికి ఆయన్ను సంభాషణలు రాయమని అడిగారు. తర్వాత... వెన్నెలకంటి, రామకృష్ణ లాంటి రచయితలు కాదన్న అనువాద చిత్రాలన్నీ ఆయన దగ్గరకు వచ్చేవి. మరోవైపు రాము తీసిన సినిమాలన్నింటికీ తెలుగు అనువాదాలు రాసేవారు.
పేరుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌నే అయినా ప్రొడక్షన్ మేనేజర్‌లా ఉండేది ఆయన పని. దీంతో ఒకరోజు రామూకి చెప్పాపెట్టకుండా సామాను సర్దుకుని హైదరాబాదుకి వచ్చేశారు. ఇక్కడ పూరి జగన్నాథ్ పరిచయమయ్యారు.అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, ఆంధ్రావాలాకు పనిచేశాడు. అప్పుడే శ్రీనువైట్ల తోనూ వినాయక్ తోనూ పరిచయమైంది. వరసగా వెంకీ, సాంబ, అందరివాడు, బాలు, ఢీ, రెడీ, హోమం, చింతకాయల రవి, అదుర్స్ సినిమాలు చేశారు. ఈయన అల్లాటప్ప వ్యక్తి కాదు ఈయన తాతయ్య కోన ప్రభాకర్ రావు మహారాష్ట్ర, సిక్కింలకు గవర్నర్గా పనిచేశారు. పుదుచ్చేరికి నాడు ఆయన లెఫ్ట్నెంట్ గవర్నర్. బాపట్ల నుంచి ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఇక తాజాగా ప్రస్తుతం కోన వెంకట్ డైరెక్టర్ బాబి దగ్గర ఆస్థాన రచయితగా పనిచేస్తున్నారు. ఆయన పనిచేసిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ తాజా చిత్రం ఈ సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలను మోసుకొస్తుంది. ఈ సందర్భంగా కోన వెంకట్ మీడియాతో మాట్లాడుతూ తన చిన్ననాటి సంగతులను పంచుకున్నారు. ఒక్క నేరం చేసిన విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. నేను కాలేజీ చదివే రోజుల్లో గంజాయి స్మగ్లింగ్ చేశాను అని తెలిపారు.
ఆయన మాట్లాడుతూ నా స్నేహితుడు ఒకడు ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి గంజాయి పండించేవాడు. దానిని అమ్మే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. వాడు చావు బతుకుల్లో ఉన్న సమయంలో మాకు విషయం తెలిసింది. వాడి అప్పులు ఎలాగైనా తీర్చాలని నిర్ణయం తీసుకున్నాం. మేము గంజాయి అమ్మడానికి గోవా బయలుదేరాం. మా నాన్న డి.ఎస్.పి కావడంతో ఆయన కారు వేసుకుని వెళ్లాం. పక్కా ప్లాన్ చేసుకొని మహబూబ్ నగర్, కర్ణాటక, గోవా బార్డర్లు దాటించి గంజాయి అమ్మి డబ్బులు తీసుకువచ్చాం. వాటితో మా ఫ్రెండ్ అప్పులన్నీ తీర్చేశాం. కానీ ఒకవేళ మేము అప్పుడు పోలీసులు దొరికిపోతే మా పరిస్థితి ఏంటి? అని చాలాసార్లు ఆలోచించా. నా జీవితంలో జరిగిన ఈ సంఘటననే ఈ సినిమాగా చేద్దామని అనుకుంటున్నా... అని చెప్పుకొచ్చారు. కాగా కోనా వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన వాల్తేరు వీరయ్యలో చిరంజీవి కూడా డ్రగ్ డీలర్ గా కనిపించబోతున్నట్టు సమాచారం.