English | Telugu

సీఎం జగన్ తో భేటీ.. చిరంజీవి వెంట తారక్!

టికెట్ ధరల తగ్గింపుతో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇతర సమస్యల గురించి చర్చించడానికి చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ నెల 10 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవనున్నారు. అయితే చిరంజీవితో పాటు వెళ్లి సీఎం జగన్ ని కలవనున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడని న్యూస్ వినిపిస్తోంది.

సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సినీ ప్రముఖులు గళాన్ని వినిపించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ సర్కార్ ని కోరారు. దీంతో ప్రభుత్వం దీనిపై అద్యయనం చేయడానికి ఓ కమిటీని వేయగా.. అద్యయనం పూర్తి చేసిన కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నుంచి సినీ ప్రముఖులకు పిలువు వచ్చింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సినీ పెద్దలతో చర్చించి ప్రభుత్వం టికెట్ ధరల అంశంపై నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

అయితే చిరంజీవితో జగన్ ని కలవనున్న వారిలో తారక్ కూడా ఉన్నాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున, మహేష్, తారక్, ప్రభాస్, చరణ్, 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' నిర్మాతలతో పాటు మరికొందరు సినీ పెద్దలు చిరంజీవి వెంట వెళ్లనున్నారని తెలుస్తోంది. మార్చి 11న 'రాధేశ్యామ్', మార్చి 25 న 'ఆర్ఆర్ఆర్', ఏప్రిల్ 29 న 'ఆచార్య', మే 12 న 'సర్కారు వారి పాట' ఇలా వరుసగా పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. టికెట్ ధరల తగ్గింపు ఈ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అందుకే ఈ సినిమాలకు చెందిన హీరోలు దర్శకనిర్మాతలు ఏపీ ప్రభుత్వంతో చర్చించడానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో నిజమెంతో ఈ నెల 10 న తేలనుంది.