English | Telugu
2014 రివ్యూ: మన హీరోల పరిస్థితేంటి??
Updated : Dec 29, 2014
మన సినిమాల్లోని కథలన్నీ హీరోల చుట్టూ తిరిగినట్టు... పరిశ్రమ కూడా కథానాయకుల చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తుంటుంది. హీరోలు క్షేమంగా ఉంటే పరిశ్రమ కూడా పచ్చగా కళకళలాడుతుంటుంది. 2014 మన కథానాయకులకు మిశ్రమ ఫలితాల్ని అందించింది. అగ్ర హీరోలు ఫామ్‌లోకి వచ్చారు. యువ కథానాయకులూ కొన్ని హిట్స్‌ని తమ ఖాతాలో వేసుకొని పరిశ్రమ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించారు. నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున విజయాలు అందుకొని పరిశ్రమలో తామెంత కీలకమో నిరూపించారు. బాలకృష్ణ లెజెండ్‌తో రికార్డులను కొల్లగొట్టారు. మనంతో కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రాన్ని అందించారు నాగార్జున. దృశ్యంలాంటి వెరైటీ సబ్జెక్ట్‌లో ఇమిడిపోయారు.. వెంకటేష్. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లకు ఈ యేడాది ఏమాత్రం కలసి రాలేదు. ఎప్పుడూ లేని విధంగా స్పీడ్ పెంచిన మహేష్ బాబు ఈ యేడాది రెండు సినిమాల్ని ప్రేక్షకులకు అందించారు. ఈయేడాది ప్రారంభంలో వచ్చిన నేనొక్కడినే, చివర్లో విడుదలైన ఆగడు అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇక ఎన్టీఆర్ రభస బాక్సాఫీసు దగ్గర మ్యాజిక్ చేయలేకపోయింది.
యువహీరోల్లో అల్లు అర్జున్ ఫామ్‌ని కొనసాగించాడు. రేసు గుర్రంతో మళ్లీ రేసులోకి వచ్చాడు. రామ్‌చరణ్ ఎవడుతో ఆకట్టుకొన్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నింపేసిన గోవిందుడు అందరివాడేలే యావరేజ్ టాక్ తెచ్చుకొంది. రవితేజ మరోసారి తన పవర్ చూపించాడు. రొటీన్ కథే అయినా... రవితేజ మార్కు వినోదం ఎక్కడా తగ్గకపోవడంతో బాక్సాఫీసు దగ్గర మంచి రిజల్టే అందుకొంది. గోపీచంద్ రూటు మార్చి... వినోదాన్ని నమ్ముకొన్న లౌక్యం ఆయనకు ఆశించిన ఫలితాన్ని తీసుకొచ్చింది. స్వామి రారాతో హిట్ బాట పట్టిన నిఖిల్.. ఈసారి కార్తికేయతోనూ మెప్పించాడు. ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం ఫ్లాపుల జాబితాలోకి వెళ్లిపోయినా.. మనం విజయంలో తన వాటా దక్కించుకోగలిగాడు నాగచైతన్య. అల్లరి నరేష్, శ్రీకాంత్, నాని, నవదీప్... వీళ్లెవరికీ విజయాలు అందలేదు. యువ హీరో నాగశౌర్య ఖాతాలో ఓ హిట్టు జమ అయ్యింది. తనకీ మంచి అవకాశాలే అందుతున్నాయి. పవన్ కల్యాణ్, ప్రభాస్, రానా, కల్యాణ్‌రామ్ సినిమాలు మాత్రం ఈ యేడాది విడుదల కాలేదు. 2015లో మాత్రం వీరి హవా చూడొచ్చు.
రొటీన్ కథల్ని ఎంచుకొన్నా సరే.. వినోదానికి ఢోకా లేకుండా చూసుకొంటే విజయం తధ్యమని 2014 నిరూపించింది. ఆ బాటలో వెళ్లినవాళ్లకే విజయాలూ అందాయి. మరి కొత్త యేడాదిలో అయినా.. మన కథానాయకుల ఆలోచనా ధోరణి మారుతుందా?? చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని విజయాలు అందుకొంటారా?? వెయిట్ అండ్ సీ.