English | Telugu
2014 రివ్యూ: టాప్ హీరోయిన్ల అడ్రస్సు గల్లంతే
Updated : Dec 29, 2014
ఈ యేడాది మన టాప్ హీరోయిన్లకు చుక్కెదురైంది. కాజల్, అనుష్క, తమన్నా, హన్సిక... వీళ్లెవ్వరికీ పెద్దగా కలసి రాలేదు. పైగా నవతరం భామలపై పోటీ పడలేక చేతులు ఎత్తేశారు. రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, రాశీఖన్నాలాంటి యంగ్ టాలెంట్ ముందు నిలబడలేక హైరానా పడుతున్నారు. సినిమాల్లేక కొందరు, ఉన్నా వర్కవుట్ కాలేక మరికొందరు, తమిళమా, తెలుగా అంటూ కన్‌ఫ్యూజ్‌లో ఇంకొందరు.. మొత్తానికి కెరీర్‌ని రాంగ్ ట్రాక్‌లో నడిపిస్తున్నారు. 2014లో అనుష్క నటించిన లింగ ఒక్క రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో అనుష్కకి ఈ యేడాది హిట్టు దక్కలేదు. పైగా ఈ సినిమాలో బాగా బొద్దుగా కనిపించింది. లింగలో నటించిన మరో కథానాయిక సోనాక్షి సిన్హా ముందు అనుష్క ఏమాత్రం నిలబడలేకపోయిందని కామెంట్లూ వినిపించాయి. దాంతో స్వీటీ బాగా హర్టయ్యింది. అనుష్క నటించిన రెండు క్రేజీ చిత్రాలు బాహుబలి, రుద్రమదేవి సెట్స్‌పై ఉన్నాయి. వీటిపైనే జేజమ్మ జాతకం ఆధారపడి ఉంది.
కాజల్ కెరీర్ ఈ యేడాది అంత బాలేదు. తాను నటించిన గోవిందుడు అందరి వాడు ఒక్కటే 2014లోవిడుదలైంది. ఎవడులో చేసినా అది చిన్న పాత్రే కాబట్టి, పెద్దగా కౌంట్ చేయాల్సిన పనిలేదు. గోవిందుడులో కాజల్ అందంగానే కనిపించినప్పటికీ ఆ పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. దానికి తోడు ఈ సినిమా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. సో.. కాజల్‌కీ హిట్టు కరువాయెనన్నమాట. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ యేడాది ఫ్లాప్ మూటగట్టుకొంది. ఎన్నో ఆశలు పెంచుకొన్న మహేష్ బాబు చిత్రం ఆగడు తుస్సుమనడంతో ఆ ఫ్లాప్ ప్రభావం తమ్మూపై పడింది. తెలుగులో తమన్నా చేతిలో ఒకే ఒక్క చిత్రం ఉంది. అదే... బాహుబలి. అటు హిందీలోనూ, ఇటు తమిళంలోనూ తమన్నాకి ఛాన్సులు రావడం లేదు. మళ్లీ వరుస ఆఫర్లతో బిజీగా కనిపించాలంటే ఓ హిట్టు కొట్టాల్సిందే. తమిళంలో ఫుల్లు బిజీ అయిపోయిన హన్సికకు తెలుగులో అన్ని అవకాశాలు దక్కలేదు. ఆమె నటించిన పాండవులు పాండవులు తుమ్మెద, పవర్ 2014లో రిలీజ్ అయ్యాయి. ఒక ఏవరేజ్, మరో హిట్టూ దక్కించుకొంది. అయితే మరో తెలుగు సినిమాపై మాత్రం సంతకం చేయలేకపోయింది. శ్రుతిహాసన్ ఎవడు, రేసుగుర్రం చిత్రాలతో టాప్ హీరోయిన్ గా చలామణీ అవుతోంది. ఆగడులో ఓ ఐటెమ్ గీతంలోనూ నర్తించింది. ఇప్పుడు మహేష్ బాబు సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అటు తమిళం, ఇటు తెలుగు.. మధ్యమధ్యలో హిందీ సినిమాలు చేసుకొంటూ అగ్ర స్థానం కోసం పోటీ పడుతోంది. అల్లుడు శీను, మనం చిత్రాలతో సమంత విజయాలు దక్కించుకొంది. రభస, సికిందర్ సినిమాలు మాత్రం దారుణంగా బోల్తాపడ్డాయి. చివర్లో తమిళ కత్తి విజయంతో కాస్త ఊరట పొందింది.
రెజీనా, రకుల్, ఆదాశర్మ, రాశీఖన్నా 2014లో తమ జోరు చూపించారు. టాప్ హీరోయిన్లకే చెమటలు పట్టిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ వరుస విజయాలతో టాప్ స్థానానినిక ఎగబాకింది. అంజలి, స్వాతి, శ్రియ వీళ్లూ ఈ యేడాది మెరిశారు. మొత్తానికి 2014లో టాప్ కథానాయికల అడ్రస్సు దాదాపుగా గల్లంతయ్యింది. అయితే హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ స్థానం మాత్రం రకుల్ ప్రీత్ సింగ్‌కే కట్టబెట్టారు సినీ జనాలు.