English | Telugu
సీక్వెలా... అంత సీన్ ఉందా??
Updated : Feb 16, 2015
టెంపర్ సీక్వెల్ తీస్తామంటూ చిత్రబృందం ప్రకటించింది, అభిమానులూ సంబరాలు చేసుకొంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ టెంపర్‌లో సీక్వెల్ తీసేంత సత్తా ఉందా?? అసలు ఈ సినిమా సీక్వెల్ అంటే కనీసం పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ లు అయినా ముందుకొస్తారా?? గణేష్ మళ్లీ అంత ధైర్యం చేస్తాడా అనేది అనుమానమే. టెంపర్ క్లైమాక్స్ చూస్తే సీక్వెల్ తీసేంత సీన్ కనిపించడం లేదు. రెండో భాగం ఉంది.. అనే హింట్ ఎక్కడా వదల్లేదు. అంటే... ఇది ఇప్పుడొచ్చిన ఆలోచన మాత్రమే. దానికి తోడు పూరి - ఎన్టీఆర్ ల కాంబినేషన్ కుదరడానికి ఇంకా టైమ్ పడుతుంది. ఎందుకంటే అటు పూరి - ఇటు ఎన్టీఆర్‌ల వేర్వేరుగా కమిట్‌మెంట్స్ చేసేసుకొన్నారు. ఇక గణేష్ పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉంది. ఈసినిమా హిట్టయినా మనోడికి మిగిలేది అంతంతమాత్రమే. ఎందుకంటే పీవీపీ చేతిలో ఈ సినిమా భవిష్యత్తు ఉంది. ముందు వారికి సెటిల్ చేసి, మిగిలింది తాను తీసుకోవాలి. పైగా ఈమధ్య గణేష్.. కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు. ''మెగా కాంపౌండ్ మనిషి అని నన్ను ఎన్టీఆర్ - పూరిలు అపార్థం చేసుకొన్నారు. మా మధ్య కమ్యునికేషన్ కుదర్లేదు. అందుకే ఈ సినిమా ఆపేద్దామనుకొన్నా'' అన్నాడు. అంటే టెంపర్ జరుగుతున్నప్పుడు లోలోపల చిచ్చు రగిలిందన్నమాట. అయితే సినిమా కోసం అందరూ కామ్ అయిపోయి.. బండి లాగించేశారు. ఇప్పుడు మళ్లీ వీళ్లంతా కలసి సినిమా చేయడం దాదాపు అసాధ్యం. పైగా సీక్వెల్ సినిమాలు తెలుగునాట అంత విజయవంతం కాలేదు. ఇడియట్, పోకిరిలను సీక్వెల్ చేస్తానని చెప్పిన పూరి ఆ మాట మర్చిపోయాడు. టెంపర్ కూడా అంతేనని ఫిల్మ్‌నగర్ జనాలు కామెంట్లు విసురుకొంటున్నారు.