English | Telugu
ఎట్టెట్టా..? శ్రీనూవైట్లా??
Updated : Feb 16, 2015
ఓ సినిమా బడ్జెట్ కంట్రోల్ తప్పిందంటే కారణం.. అక్షరాలా దర్శకుడే. సినిమాని ఎంతలో తీయాలి?? ఎంతలో తీస్తే నిర్మాతకు లాభం వస్తుంది?? అనే లెక్కలు దర్శకుడికి స్పష్టంగా తెలిసుండాలి. సినిమా ఓమాదిరిగా ఆడినా, అస్సలు ఆడకపోయినా నిర్మాతని గట్టెక్కించే కిటుకు తెలిసుండాలి. శ్రీనువైట్ల నిర్మాతల తరపున ఆలోచించే దర్శకుడే. కానీ ఆగడు విషయంలో మాత్రం అతని లెక్క తప్పింది. జయాపజయాలు ఇండ్రస్ట్రీలో మామూలే. కాకపోతే ఓ సినిమా ఫ్లాప్ అయితే అన్ని వేళ్లూ, దర్శకుడివైపే చూపించడం అరుదు. ఆగడు విషయంలో శ్రీనువైట్లకు ఇదే అనుభవం ఎదురైంది. అతి విశ్వాసంతో అవసరమైనదానికంటే ఎక్కువ ఖర్చు చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నాడు శ్రీనువైట్ల. అందుకే... రామ్‌చరణ్ - డి.వి.వి.దానయ్యల సినిమాకి మాత్రం పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడట. ఈసినిమా నుంచి సమంతను తప్పించి, రకుల్ ని ఎంచుకొన్నారు. దానికి కారణం.. రెమ్యునరేషన్ తక్కువ కావడమే. అంతేకాదు.. శ్రీనువైట్ల కూడా ''నాకు పారితోషికం వద్దు'' అన్నాడట. లాభాల్లో వాటా తీసుకొంటా... అని చెప్పాడట. దాంతో నిర్మాత డి.వి.వి.దానయ్య ఖుషీ అయిపోతున్నాడు. సినిమాలో వాటా తీసుకొంటే.. సదరు దర్శకుడు మరింత శ్రద్ధతో పనిచేస్తాడని ప్రత్యేకంగా చెప్పాలేంటి?? నిజంగా శ్రీనువైట్ల ఈ నిర్ణయం తీసుకొంటే.. అది శుభపరిణామమే. 'ఆడగు'తో డామేజ్ అయిన తన ఇమేజ్‌ని చరణ్ సినిమాతో తిరిగి దక్కించుకోవాలన్నది శ్రీనువైట్ల ప్రయత్నం. అందుకే తాను కొంచెం కొంచెం తగ్గుతూ, తలొంచుతూ వస్తున్నాడు. ఆఖరికి విబేధాలతో విడిపోయిన కోన వెంకట్‌తో మళ్లీ జట్టుకట్టాడు. ఈసారి మరింత కసితో పనిచేస్తున్నాడట. చూస్తుంటే... శ్రీనువైట్ల హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ టూ శ్రీనువైట్లా..!