English | Telugu
పవన్ దెబ్బకి.. మన పరువు గోవిందా!
Updated : Apr 8, 2016
బాహుబలి ఇచ్చిన స్ఫూర్తో, లేదంటే బాహుబలి రికార్డు బద్దలు కొట్టేయాలన్న అత్యాసో.. లేదంటే తన టాలెంట్‌ని బాలీవుడ్ జనాలకు కూడా రుచి చూపించాలన్న కసో తెలీదుగానీ.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని హిందీలో డబ్ చేసి మరీ రిలీజ్ చేశారు. రూ.12 కోట్లకు ఈరోస్ సంస్థ ఈ సినిమా డబ్బింగ్ రైట్స్‌ని కొనేసిందని, ఏకంగా ఎనిమిది వందల థియేటర్లలో భారీగా రిలీజ్ చేస్తున్నామని ఆర్భాటాలకు పోయారు సర్దార్ దర్శక నిర్మాతలు. పవన్ ని బాలీవుడ్‌లో ఎవరు చూస్తారు?? సర్దార్‌కి అంత సీన్ ఉందా? అనే అనుమానాలు టాలీవుడ్ లో వ్యక్తం అయ్యాయి. బాలీవుడ్ వాసులూ... సర్దార్‌ని లైట్ తీసుకొన్నారు. కమాల్ ఖాన్ లాంటోళ్లు ఈ సినిమాపై సెటైర్లు వేశారు. పట్టుమని పది మంది థియేటర్లకు వచ్చినా నేను తెలుగు రాష్ట్ర్రాలలో నగ్నంగా తిరుగుతా అని శపథం చేశాడాయన. రాంగోపాల్ వర్మకీ, కమాల్ ఖాన్‌కీ ట్విట్టర్‌లో మాటల యుద్దమే సాగింది. ఇప్పుడు కమాల్ ఖాన్ మాటే నిజం అయ్యేట్టు ఉంది.
సర్దార్ బెనిఫిట్ షోకే టాలీవుడ్‌లో ఫ్లాప్ టాక్ బయటకు వచ్చేసింది. ఇక బాలీవుడ్ పరిస్థితి ఏమిటో, అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవొచ్చు. ఈ సినిమా బాలీవుడ్‌లో కనీసం కోటి రూపాయలు వసూలు చేసినా గొప్పే అని ఇప్పుడు ట్రేడ్ విశ్లేషకులు తేల్చి చెప్పేస్తున్నారు. అంటే... సర్దార్‌కి బాలీవుడ్లో భారీ పరాభవం తప్పదన్నమాట. బాహుబలి పుణ్యమా అని దక్షిణాది చిత్రాలకు ఇప్పుడిప్పుడే హిందీలో కాస్తో కూస్తో గౌరవం దక్కుతున్న సమయంలో.. సర్దార్ పరాభవంతో మరో నాలుగు అడుగులు వెనక్కి పడినా ఆశ్చర్యం లేదు. కమాల్ ఖాన్.. నువ్వు గెలిచావయ్యా... సారీ మా సర్దార్ ఓడిపోయాడు.