English | Telugu

'సామజవరగమన'కి సంచలన వసూళ్లు!

సినిమా బాగుంటే చాలు.. హీరో ఎవరు? బడ్జెట్ ఎంత? అనే లెక్కలు వేసుకోకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'సామజవరగమన' చిత్రం మరోసారి నిరూపించింది. పెద్దగా అంచనాల్లేకుండా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని, రోజురోజుకి వసూళ్లను పెంచుకుంటుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద హిట్ స్టేటస్ దక్కించుకున్న ఈ మూవీ.. ఫుల్ రన్ లో బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.80 లక్షల షేర్, రెండో రోజు రూ.68 లక్షల షేర్, మూడో రోజు రూ.1.07 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.1.16 కోట్ల షేర్ రాబట్టిన 'సామజవరగమన'.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.3.71 కోట్ల షేర్ సాధించింది. ఏరియాల వారీగా చూస్తే నాలుగు రోజుల్లో నైజాంలో రూ.1.64 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.42 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.1.65 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి రూ.1.70 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా చూస్తే నాలుగు రోజుల్లో రూ.5.41 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా రూ.3.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'సామజవరగమన'.. ఇప్పటికే రెండు కోట్ల దాకా ప్రాఫిట్స్ చూసింది. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో ఫుల్ రన్ లో ఈ సినిమా భారీ లాభాలు చూసే ఛాన్స్ ఉంది. యూఎస్ లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ హాఫ్ మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.

శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.