English | Telugu
'సలార్' టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఇదేం టైమింగ్ బ్రో!
Updated : Jul 3, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించగల సినిమా ఇది అని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ వచ్చింది.
'సలార్' టీజర్ ని జూన్ 6 ఉదయం5:12 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా చిత్ర బృందం ఒక పోస్టర్ ను వదిలింది. ఒక భారీ యాక్షన్ సన్నివేశంలోని స్టిల్ ని పోస్టర్ లో చూడొచ్చు. చేతిలో సుత్తి పట్టుకొని ఫైట్ చేస్తున్న ప్రభాస్ కటౌట్ చూస్తుంటే.. 'కేజీఎఫ్'ని మించిన ఎలివేషన్స్, వయోలెన్స్ ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారని అర్థమవుతోంది.
మామూలుగా సినిమా అప్డేట్ ని అందరూ మేల్కొని ఉండి, యాక్టివ్ గా ఉన్న సమయంలో ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు వ్యూస్, లైక్స్ రికార్డులు కూడా ఫ్యాన్స్ పట్టించుకుంటున్నారు కాబట్టి.. స్టార్ హీరోల సినిమాల టీజర్లు, ట్రైలర్లు సరైన సమయానికి విడుదల చేయడమనేది చాలా ముఖ్యం. అలాంటిది అందరూ సరిగా నిద్ర కూడా లేవని సమయంలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో టీజర్ రిలీజ్ చేయాలని సలార్ టీమ్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక వైపు ఫ్యాన్స్ లో టీజర్ వస్తుందన్న ఆనందమున్నా, మరోవైపు వారు రిలీజ్ టైం పట్ల కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.
'సలార్' పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. 'సాహో' సినిమా నార్త్ లో మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, ఓవరాల్ గా మాత్రం బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గానే మిగిలింది. 'రాధేశ్యామ్' అయితే పూర్తి నెగటివ్ టాక్ తో డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇటీవల విడుదలైన 'ఆదిపురుష్' రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగలడం ఖాయమైంది. ఇలా వరుసగా మూడు పరాజయాలు పలకరించడంతో.. 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సలార్'పైనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న 'సలార్' సినిమాని 2023, సెప్టెంబర్ 28 న భారీస్థాయిలో విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.