English | Telugu
శివ కార్తికేయన్ తో అనుదీప్ మూవీ.. అప్పుడే రిలీజ్ డేట్ వచ్చింది
Updated : May 31, 2022
'జాతి రత్నాలు' సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కేవీ అనుదీప్. కొత్త తరహా కామెడీతో నవ్వులు పూయించిన అనుదీప్.. తన తదుపరి సినిమాని కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ కెరీర్ లో 20వ సినిమాగా రానున్న ఈ చిత్రం అప్పుడే విడుదలకు సిద్ధమైంది.
శివ కార్తికేయన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. 'డాక్టర్', 'డాన్' సినిమాలతో మంచి విజయాలు అందుకున్న కార్తికేయన్ ఇప్పటికే తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెలుగు దర్శకుడితో సినిమా చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని అనుదీప్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. వినాయక చవితి కానుకగా ఆగష్టు 31 న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ఉక్రెయిన్ బ్యూటీ మరియా, సత్యరాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. టైటిల్, ఫస్ట్ లుక్ మరియు ఈ సినిమాకి సంబంధించిన ఇతర అప్డేట్స్ త్వరలోనే అందిస్తామని మేకర్స్ తెలిపారు.