English | Telugu

జేసీబీ ఇచ్చి పేద‌ కుటుంబాన్ని ఆదుకున్న‌ ప్ర‌కాష్ రాజ్!

సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ప్ర‌కాష్ రాజ్ ఫౌండేష‌న్ ద్వారా ఎంతో మందికి అండ‌గా నిలిచిన ప్ర‌కాష్ రాజ్.. తాజాగా ఓ పేద కుటుంబానికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.

కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న శ్రీరంగపట్నంలో ఓ కుటుంబం ఉపాధి లేక కొన్నాళ్లుగా చాలా ఇబ్బందులు ప‌డుతుంది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న ప్ర‌కాష్ రాజ్ త‌న ఫౌండేష‌న్ ద్వారా ఆ కుటుంబానికి జేసీబీని అందజేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఓ కుటుంబానికి జేసీబీ అందించామని ఆయన తెలిపారు. జీవితాన్ని తిరిగి ఇవ్వడంలో ఉన్న ఆనందమే వేరని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వివిధ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాదు 'మా' అధ్య‌క్ష బ‌రిలోనూ నిలిచారు. అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న 'మా' ఎన్నిక‌ల‌లో మంచు విష్ణుతో ప్ర‌కాష్ రాజ్ తలపడనున్నారు.