English | Telugu

ప్ర‌కాశ్‌రాజ్ విందు రాజ‌కీయానికి మోహ‌న్‌బాబు కౌంట‌ర్‌.. పెద్ద‌ల‌కు స‌న్మానం!

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ రాజ‌కీయాలు అమితాస‌క్తిని క‌లిగిస్తున్నాయి. తెలుగు సినిమా న‌టుల‌కు సంబంధించిన 'మా'పై పెత్త‌నానికి క‌న్న‌డ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుండ‌గా, ఆయ‌న‌కు మెగా బ్యాచ్‌ నుంచి గ‌ట్టి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ప‌లువురు పాపుల‌ర్ న‌టీన‌టులు ప్ర‌కాశ్‌రాజ్‌ను అధ్య‌క్షుడిగా ఎన్నుకొని, ఆయ‌న సేవ‌లో త‌రించేందుకు త‌పించిపోతున్నారు.

మ‌రోవైపు త‌మిళ గ‌డ్డ‌మీద నుంచి హైద‌రాబాద్‌కు తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ రావ‌డానికి ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు గుర‌య్యామ‌ని చెప్తున్న‌ సీనియ‌ర్ న‌టులు ఎలాగైనా తెలుగువారికే 'మా' అధ్య‌క్ష పీఠాన్ని క‌ట్టిపెట్టాల‌ని ఆశిస్తున్నారు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని గుర్తుచేసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. అలాంటివారంతా అధ్య‌క్షునిగా మంచు విష్ణును ఎన్నుకోవాల‌ని భావిస్తున్నారు.

ఆదివారం ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ విందు రాజ‌కీయాలు చేసి, 'మా' ఎన్నిక‌ల వేడిని మ‌రింత ర‌గ‌ల్చ‌గా, అందుకు ప్ర‌తిగా మోహ‌న్‌బాబు సోమ‌వారం రాత్రి బంజారా హిల్స్‌లోని పార్క్ హ్యాత్ హోట‌ల్‌లో ఓ మీటింగ్ ఏర్పాటుచేసి, కొంత‌మంది సీనియ‌ర్ల‌ను స‌న్మానించారు. స‌న్మానం అందుకున్న‌వారిలో సీనియ‌ర్ మోస్ట్ యాక్ట‌ర్ కోట శ్రీ‌నివాస‌రావు, సీనియ‌ర్ డైరెక్ట‌ర్ బి. గోపాల్ లాంటివారు ఉన్నార‌ని స‌మాచారం. ఈ మీటింగ్‌కు ల‌క్ష్మీప్ర‌స‌న్న‌, విష్ణు, న‌రేశ్‌, త్రిపుర‌నేని చిట్టి, అశోక్‌కుమార్‌, క‌రాటే క‌ల్యాణి త‌దిత‌రులు హాజ‌రయ్యారు. అయితే 'మా' ఎన్నిక‌ల‌కు, ఈ మీటింగ్‌కు ఎలాంటి సంబంధం లేద‌నీ, సినీ పెద్ద‌ల‌ను గౌర‌వించుకోడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేశామ‌నీ మోహ‌న్‌బాబు వ‌ర్గం అంటోంది.