English | Telugu

‘జైలర్’ నటుడు హఠాన్మరణం

తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు జి.మరిముత్తు కన్నుమూశారు. 57 ఏళ్ళ మరిముత్తు శుక్రవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మరిముత్తు హఠాన్మరణంతో తమిళ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్నటి వరకు ఎంతో మంచిగా ఉన్న ఆయన.. ఈరోజు ఉదయం లేరనే వార్త అందరినీ షాక్ కి గురి చేసింది.

నటుడిగా మరిముత్తుకి తమిళనాట మంచి గుర్తింపు ఉంది. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన.. 'వాలి'తో నటుడిగా మారారు. గత 20 ఏళ్లుగా వరుస సినిమాలు చేస్తూ విభిన్న పాత్రలతో నటుడిగా అలరిస్తున్నారు. ఇప్పటిదాకా 75కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. రజినీకాంత్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'జైలర్'లో పన్నీర్ అనే పాత్ర పోషించారు మరిముత్తు. ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటింది. అలాగే తమిళ్ లో రూపొందుతోన్న మరో బిగ్గెస్ట్ ఫిల్మ్ 'ఇండియన్-2'లోనూ నటిస్తున్నారు. ఇలా వరుస భారీ సినిమాలతో అలరిస్తున్న ఆయన ఉన్నట్లుండి గుండెపోటుతో చనిపోయారని తెలుసుకుని కోలీవుడ్ దిగ్బ్రాంతికి లోనైంది. ఇక మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మరిముత్తు 'కన్నుం కన్నుమ్', 'పులివాల్' సినిమాలతో దర్శకుడిగా కూడా సత్తా చాటారు. అలాగే టెలివిజన్, ఓటీటీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు.