English | Telugu
‘శీష్ మహల్’ మూవీ రివ్యూ
Updated : Feb 26, 2024
మూవీ : శీష్ మహల్
నటీనటులు: రాహుల్ రామకృష్ణ, సాయి, రోహిత్, ప్రమీళ, ఆర్నాల్డ్, అద్వైత్
ఎడిటింగ్: రోహిత్
మ్యూజిక్: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ:
నిర్మాతలు : స్నేహల్ జంగల్
దర్శకత్వం: శశి
ఓటీటీ: ఈటీవి విన్
చిన్న సినిమాలలో కథ బాగుంటే ఓటీటీ ప్రేక్షకులు ఆదిరిస్తారు. రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రలో శశి దర్శకత్వం వహించిన ' శీష్ మహల్ ' మూవీ తాజాగా ఓటీటీ వేదిక ఈటీవి విన్ లో రిలీజైంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:-
హైదరాబాద్ కి చెందిన కుర్రాడు ఫకీర్.. రోడ్ల మీద చెత్త ఏరుకుంటు అవి అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగిస్తుంటాడు. అయితే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పిల్లలతో కలిసి సినిమా చూడాలనుకుంటాడు. ఇదే సమయంలో ఖమ్మంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న లావణ్య హైదరాబాద్ లోని ఫిల్మ్ ఫెస్టివల్ కోసం రెడీ అవతుంటుంది. ఫిరోజ్ హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో క్యాంటీన్ నడుపుకుంటూ జీవితం సాగిస్తుంటాడు. అతనిని అర్థం చేసుకునే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అతను తన పిల్లలకి ఆ థియేటర్ లో నడిచే సినిమాలని చూపించాలనుకుంటాడు. ఆర్ఖే( రాహుల్ రామకృష్ణ) ఓ ఫిల్మ్ మేకర్. ఓ టీవీ ఛానెల్ లో క్రైమ్ స్టోరీస్ కి డైరెక్టర్ గా చేస్తుంటాడు. అయితే తను ఓ డాక్యుమెంటరీ తీసి సమాజంలో మార్పుని తీసుకురావాలనుకుంటాడు. మరి అతను డాక్యుమెంటరీ తీసాడా? ఫిరోజ్ తన పిల్లలకి సినిమా చూపించాడా? ఇంటర్ అమ్మాయి లావణ్య హైదరాబాద్ లో ఏం చేసింది? చెత్త ఏరుకునే అబ్బాయి ఫకీర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సినిమా చూశాడా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:-
ఓ ఫిల్మ్ మేకర్ ఆలోచనలని సినిమాగా తీయాలనే ఉద్దేశంతో రూపొందించిన ఈ సినిమా అంతగా ప్రేక్షకుడిని మెప్పించదు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని వాడుకున్నారు. చాలా చోట్ల డిస్టబెన్స్ గాను అర్థం కాకుండా స్క్రీన్ ప్లే సాగుతుంది.
ఏ కథకి సరైన ముగింపు ఇవ్వకపోవడం పెద్ద మైనస్. ఫిల్మ్ ఫెస్టివల్ కోసం పిల్లల ఆలోచన విధానం. ఓ ఫిల్మ్ మేకర్ ఆలోచనలు ఇలాంటి మంచి కాన్సెప్ట్ ని పెట్టుకొని అనవసరమైన సీన్లతో సాగదీసారు. చాలా నేచురల్ గా ఉండాలనేమో మొబైల్స్ తో తీసిన షాట్స్ ని వాడేసారు. ఈ సినిమాలోని కొన్ని సీన్లని మనం చూస్తుంటే అవి సీన్లా? లేక షాట్సా అనే అనుమానం వస్తుంది. గంట యాభై నిమిషాల నిడివితో రూపొందించిన ఈ సినిమాలో ఏదీ క్లారిటీ లేదు.
సినిమా మొత్తం హైదరాబాద్ చుట్టూ సాగిన కథలో బలం లేకుంటే ఎలా ఉంటుంది. చిన్న సినిమా అయిన కాస్త కామెడీ, కాస్త సస్పెన్స్, ఎమోషనల్ సీన్స్.. ఇవేమీ లేకపోతే ఎలా. సినిమా చూడాలనుకునే ప్రతీ ప్రేక్షకుడికి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. అదే లేకపోతే ప్రేక్షకుడు ఎలా చూడగలగుతాడు. అడల్ట్ సీన్స్ లేవు. నిడివి తక్కువే కానీ కథలో ఏం ఉందని చూడాలి. ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు.. అసలు ఇది సినిమ అనే కంటే నాలుగు చిన్న షార్ట్ ఫిల్మ్ లని ఒక ఎపిసోడ్ గా కలిపేసినట్టుగా ఉంది. సరైన స్క్రీన్ ప్లే లేదు. ఉన్నదల్లా వివేక్ సాగర్ మ్యూజిక్ ఒక్కటి బాగుంది. శశి తీసిన ఈ సినిమా ఓ పదేళ్ళ ముందు వస్తే కాస్త బాగుండేదేమో.. విడుదల చేయడం కొంచెం లేట్ అయిందమో కాదు కాదు చాలా లేట్ అయింది. ఇక సినిమాకి చూడాలనుకునేవారికి ఓపికతో పాటు సమయం ఉండాలి. ఈ సినిమా అంత ఈజీగా అర్థం అవ్వదు. అంతగా ఈజీగా ఎండ్ అవ్వదు.
నటీనటుల పనితీరు:-
ఆర్ఖే గా రాహుల్ రామకృష్ణ ఆకట్టుకున్నాడు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : -
సరైన ముగింపు లేని కథని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. అతికష్టం మీద ఒకసారి చూడొచ్చు
రేటింగ్: 2 / 5
✍️. దాసరి మల్లేశ్