English | Telugu
పోసానికి మోహన్ బాబు మాస్ వార్నింగ్!
Updated : Feb 26, 2024
మంచు మోహన్ బాబుకి ప్రేమ, కోపం అన్నీ ఎక్కువే. ఏదీ మనసులో దాచుకోరు. అభినందించినా, హెచ్చరించినా ఎలాంటి మొహమాటం లేకుండా పబ్లిక్ గా చేస్తారు. అలాంటి మోహన్ బాబు.. తాజాగా పోసాని కృష్ణమురళిని పేరు చెప్పకుండా పరోక్షంగా హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది.
ఏపీ అధికార పార్టీ వైసీపీకి మద్దతుగా ఉంటున్న పోసాని.. మాజీ సీఎం చంద్రబాబు పైనా, తెలుగుదేశం పార్టీ పైనా హద్దుమీరి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాబుపై ఎన్నోసార్లు నోరు పారేసుకున్న పోసాని.. ఇటీవల కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు హెరిటేజ్ సంస్థ మోహన్ బాబుది అయితే.. మోసం చేసి లాక్కున్నారని పోసాని ఆరోపించారు. దీనిపై తాజాగా స్పందించిన మోహన్ బాబు.. తన పేరుతో రాజకీయం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానాని హెచ్చరించారు.
'విజ్ఞప్తి' పేరుతో తాజాగా మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ ను రిలీజ్ చేశారు. "ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించు కుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ..... ధన్యవాదాలతో మంచు మోహన్ బాబు" అని ఆ నోట్ లో పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో మోహన్ బాబు కూడా వైసీపీకి మద్దతుగా నిలిచారు. అలాంటి మోహన్ బాబు.. వైసీపీ మద్దతుదారుడైన పోసానికి పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.