English | Telugu

నానిది కూడా అదే రికార్డు మోత

హిందీలో "బ్యాండ్ బాజా బారాత్" చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో"ఆహా కళ్యాణం" పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని, వాణి కపూర్ జంటగా నటిస్తున్నారు. మాములుగా రీమేక్ సినిమాలు అంటే అందరికి తెలిసిందే. ఒక చోట విజయం సాధించిన చిత్రాన్ని మరో చోట కొత్తగా నిర్మించి విడుదల చేయడం.

అయితే హిందీలో "బ్యాండ్ బాజా బారాత్" విడుదలైన తర్వాత తెలుగులో "జబర్దస్త్" అనే సినిమా వచ్చింది. ఇందులో సిద్ధార్థ్, సమంత జంటగా నటించారు. కానీ ఈ సినిమా "బ్యాండ్ బాజా బారాత్"కు రీమేక్ కాదు. కానీ ఆ సినిమానే రీమేక్ చేసారేమో అనే విధంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే...తెలుగులో వచ్చిన "జబర్దస్త్" చిత్రం మొత్తం కూడా హిందీలో వచ్చిన "బ్యాండ్ బాజా బారాత్" సినిమా లాగే ఉంటుంది. కానీ తెలుగులో "జబర్దస్త్" అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఇదిలా ఉంటే... హిందీ చిత్రానికి రీమేక్ అంటూ తెరకెక్కుతున్న "ఆహా కళ్యాణం" చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదల చేసారు. నిజానికి నాని ఈ రీమేక్ చేస్తున్నాడని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా.. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని అనుకున్నారు. కానీ తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూసి, తాము అనుకున్నది కరెక్టే అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఇదివరకే అలాంటి కథతోనే "జబర్దస్త్" చిత్రం వచ్చింది. మరి నాని కూడా మళ్ళీ అదే సినిమా చేస్తే ఫ్లాప్ కాకపోతే ఏం అవుతుంది.

జనాలు కూడా ఒకే సినిమాను ఎన్ని సార్లు చూస్తారు చెప్పండి. అరిగిపోయిన రికార్డులాగా అదే సినిమాను మళ్ళీ మళ్ళీ చూపిస్తే జనాలు ఇక అలాంటి సినిమాలను చూడటం మాట పక్కనపెడితే.. అసలు ఆ సినిమా గురించి పట్టించుకునే వారే కరువవుతారు. మరి ఇప్పటికైనా నాని ఇలాంటి అరిగిపోయిన రికార్డుల సినిమాలు కాకుండా కొంచెం కొత్తగా సినిమాల గురించి అయిన ఆలోచిస్తే బాగుంటుంది