English | Telugu

దటీజ్ ఎన్టీఆర్.. సినిమా కోసం పుస్తకం పట్టాడు!

పురాణ పురుషుల పాత్రలు పోషించేటప్పుడు నటులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఆ పాత్ర గురించి తమ వంతుగా ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎంత ఎక్కువ సమాచారం తెలిస్తే.. ఆ పాత్రలో అంతగా ఒదిగిపోవచ్చని నటులు నమ్ముతుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ సినిమా కోసం ఇదే పాటిస్తున్నారు. తాజాగా 'మురుగ' పుస్తకంతో దర్శనమిచ్చారు.

ఎన్టీఆర్ ఈ ఆగస్టులో 'వార్-2'తో అలరించనున్నారు. ఒక సాంగ్ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. ఇటీవల 'డ్రాగన్' కొంతభాగం షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్.. తాజాగా చిన్న బ్రేక్ ఇచ్చి.. వార్-2 సాంగ్ షూట్ కోసం ముంబై వెళ్ళారు. ఈ సమయంలో ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ చేతిలో ఆనంద్ బాలసుబ్రమణియన్ రచించిన 'మురుగ' పుస్తకం దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ ఫిల్మ్ చేయనున్నారు ఎన్టీఆర్. గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి కథతో ఇది తెరకెక్కనుంది. నందమూరి కుటుంబం పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. అలాగే త్రివిక్రమ్ కి పురాణాల మీద ఎంతో పట్టుంది. దాంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో మైథలాజికల్ ఫిల్మ్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా తన వంతుగా కుమారస్వామి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 'మురుగ' పుస్తకం చదువుతున్నట్లు తెలుస్తోంది.

సినిమా కోసం ఎంతగానో కష్టపడే హీరోలలో ఒకరిగా ఎన్టీఆర్ కి పేరుంది. గతంలో 'జై లవ కుశ' సినిమాలో రావణుడి భక్తుడిగా కనిపించిన 'జై' పాత్ర కోసం తన వంతుగా ఎంతో హోంవర్క్ చేశారు ఎన్టీఆర్. ఇప్పుడు కుమార స్వామి పాత్ర కావడంతో అంతకుమించి హోంవర్క్ చేయబోతున్నారని అర్థమవుతోంది.