English | Telugu
మరో బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్!
Updated : Apr 16, 2023
'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ అడుగులు బాలీవుడ్ వైపు పడుతున్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ 'వార్-2'లో నటించనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు. ఇదిలా ఉంటే మరో బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ లోనూ ఎన్టీఆర్ నటించే అవకాశముందని తెలుస్తోంది.
'ఉరి' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో 'ది ఇమ్మోర్టల్స్ అశ్వత్థామ' అనే భారీ మైథలాజికల్ ఫిల్మ్ రూపొందనుంది. మొదట విక్కీ కౌశల్ హీరోగా రోనీ స్క్రూవాలా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాలి అనుకున్నారు. కానీ ఆ తర్వాత జియో స్టూడియోస్ రంగంలోకి దిగింది. ఇక హీరోగా విక్కీ కౌశల్ కి బదులుగా రణ్ వీర్ సింగ్ నటించే అవకాశముందని న్యూస్ వినిపించింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ స్టార్లు ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు తెరపైకి వచ్చాయి. అశ్వత్థామ పాత్ర కోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్, 'పుష్ప'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ హీరోలకు బదులుగా వీరితో సినిమా తీస్తే.. నార్త్, సౌత్ రెండూ కవర్ అయ్యి, అసలుసిసలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఎన్టీఆరే నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మైథలాజికల్ సినిమాలు చేయడంలో నందమూరి హీరోలు దిట్ట. ఇప్పటికే ఎన్టీఆర్ 'యమదొంగ'లో యముడిగా కనిపించి అలరించాడు. మరోవైపు 'వార్-2'తో బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అశ్వత్థామగా ఎన్టీఆర్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు.
అల్లు అర్జున్ సైతం ఇప్పటికే ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. హిస్టారికల్ ఫిల్మ్ 'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. మరి అశ్వత్థామగా ఇద్దరిలో ఎవరు రంగంలోకి దిగుతారో చూడాలి.