English | Telugu

'కంగువ'తో పాన్ ఇండియా స్టార్ అవుతాడా!

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీకి 'కంగువ' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. సూర్య కెరీర్ లో 42 వ సినిమాగా తెరకెక్కుతున్న 'కంగువ'ను యూవీ క్రియేషన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. 3D ఫార్మాట్ లోనూ విడుదల కానున్న ఈ చిత్రం ఏకంగా పది భాషల్లో అలరించనుంది. సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి 'కంగువ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుపుతూ తాజాగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

'కంగువ' టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంటుంది. ఆయుధాలతో గుర్రం మీద వెళ్తున్న కథానాయకుడి రూపం, వెనుక భారీ సైన్యంతో గ్రాఫిక్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ లో గద్దని పోలిన పక్షి రూపం పవర్ ఫుల్ గా ఉంది. ఇక టైటిల్ వీడియోకి దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతం అందించాడు. అలాగే ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్థంలో విడుదల చేయబోతున్నట్లు వీడియోలో చూపించారు.

'బాహుబలి'తో పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక తెలుగు హీరోలు, కన్నడ హీరోలు పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ లు అందుకొని పాన్ ఇండియా స్టార్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి తమిళ హీరోలు మాత్రం ఇంకా పాన్ ఇండియా సక్సెస్ ని టేస్ట్ చూడలేదు. మరి 'కంగువ'తో సూర్య తమిళ్ నుండి మొదటి పాన్ ఇండియా హీరో అనిపించుకుంటాడేమో చూడాలి.