English | Telugu

లావణ్య అంటే రాజ్‌ తరుణ్‌ భయపడుతున్నాడా.. అందుకే ముందస్తు బెయిల్‌కి వెళ్లాడా?

గత కొన్ని రోజులుగా రాజ్‌ తరుణ్‌, లావణ్య వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది కానీ ఓ కొలిక్కి రావడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతోనే సరిపోతోంది. తనను పెళ్లి చేసుకొని మరొకరితో సంబంధం పెట్టుకొని తనకు దూరంగా ఉంటున్నాడని లావణ్య నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో మొదట ఫిర్యాదును స్వీకరించలేదు పోలీసులు. ఆ తర్వాత కొన్ని ఆధారాలు చూపించడంతో రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని పోలీసులు అతనికి నోటీసులు పంపించారు. తనకు ఉన్న బిజీ షెడ్యూల్‌ కారణంగా విచారణకు హాజరు కాలేనని రాజ్‌ తరుణ్‌ పోలీసులకు లేఖ రాశాడు. ఈ కేసుకు సంబంధించి గురువారం హై కోర్టును ఆశ్రయించాడు. తనకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చెయ్యాల్సింది కోర్టును కోరాడు. దీనిపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. ఈరోజు దీనికి సంబంధించిన విచారణ చేపట్టనుంది. ఈ కేసులో బెయిల్‌ మంజూరు అవుతుందా లేక అతన్ని అరెస్ట్‌ చేస్తారా అనే విషయం సస్పెన్స్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. బుధవారం మాధాపూర్‌ కాకతీయ హిల్స్‌లోని రాజ్‌ తరుణ్‌ ఇంటికి వెళ్ళి అక్కడ కొంత హంగామా చేసింది లావణ్య. రాజ్‌తరుణ్‌తో, అతని తల్లిదండ్రులతో మాట్లాడాలంటూ అతని ఫ్లాట్‌ ముందు హడావిడి చేసింది. దీనిపై గురువారం మాధాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు. తమ ఇంటికి వచ్చి తలుపులు తియ్యాలంటూ లావణ్య గొడవ చేసిందని, నేరచరిత్ర కలిగి ఉన్న ఆమె వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు. కాబట్టి తమకు రక్షణ కల్పించాలంటూ వారు కోరారు. దీనిపై విచారణ చేపడతామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు.

తనపై లావణ్య ఫిర్యాదు చేసిన మరుసటి రోజు మీడియాతో మాట్లాడిన రాజ్‌ తరుణ్‌ ఈ విషయంలో లీగల్‌గానే వెళతానని స్పష్టం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రాలేదు. విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేసినా వెళ్ళలేదు. ఇటీవల తన సినిమా ప్రమోషన్‌ కోసం మాత్రమే బయటికి వచ్చిన రాజ్‌ తరుణ్‌ రకరకాల విమర్శలను ఎదుర్కొన్నాడు. లావణ్య చేస్తున్న ఆరోపణలో నిజం లేదని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెబుతున్నాడు. అయితే రాజ్‌ తరుణ్‌ ముందస్తు బెయిల్‌ కోసం వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తనని అరెస్ట్‌ చేస్తారని భయపడుతున్నాడా, అందుకే ముందస్తు బెయిల్‌ కోసం వెళ్లాడా అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఈరోజు కోర్టులో విచారణ పూర్తయితేగానీ ఈ విషయంలో ఒక క్లారిటీ అనేది రాదు.