English | Telugu
ఆస్కార్ నామినేషన్ పొందిన ఇండియన్ డాక్యుమెంటరీ!
Updated : Feb 9, 2022
భారతీయ డాక్యుమెంటరీ 'రైటింగ్ విత్ పైర్' 94వ అకాడమీ అవార్డుల్లో బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీ కింద నామినేషన్ సంపాదించింది. మంగళవారం రాత్రి ట్రేసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ ఆస్కార్ నామినేషన్లను ప్రకటించారు. రింటూ థామస్, సుష్మిత్ ఘోష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ 'ఖబర్ లహరియా' అనే న్యూస్‌పేపర్ ఎదుగుదలను చూపిస్తుంది. 'ఖబర్ లహరియా' అనేది మనదేశంలో దళిత మహిళలు నడుపుతున్న ఏకైక వార్తాపత్రిక కావడం గమనార్హం.
మీరా అనే చీఫ్ రిపోర్టర్ ఆధ్వర్యంలో దళిత మహిళా బృందం చుట్టూ ఈ డాక్యుమెంటరీ నడుస్తుంది. అంకితభావం ఉన్న జర్నలిస్టుగా మీరా తన బృందాన్ని ఎలా నడిపిందనే విషయాన్ని ఆసక్తికరంగా దర్శకులు ఈ డాక్యుమెంటరీలో చిత్రించారు. పురుషాధిక్యం రాజ్యం చేసే వార్తా ప్రపంచంలో మీరా, ఆమె సహ మహిళా జర్నలిస్టులు సంప్రదాయాన్ని బ్రేక్‌చేసి, ఒక శక్తిమంతమైన టీమ్‌గా ఎలా మారారనేది ఇందులో మనం చూస్తాం.
'రైటింగ్ విత్ ఫైర్'తో పాటు యాసెన్షన్, ఆటికా, ఫ్లీ, సమ్మర్ ఆఫ్ సోల్ డాక్యుమెంటరీలు నామినేషన్ పొందాయి. మార్చి 27న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్నది.