English | Telugu
మనుషుల్ని చదివిన దర్శకుడు.. క్రిష్
Updated : Nov 9, 2014
క్రిష్.. ఎన్ని సినిమాలు చేశాడని..??
వేదం
గమ్యం
కృష్ణం వందే జద్గురుమ్..!
మూడే కదా..? అయినా ఇవి చాలవా?? ఆ దర్శకుడి స్టామినా చెప్పడానికి..?? మూడు తీశాడా, మూడొందల ముఫ్ఫై మూడు తీశాడా - అని కాదు, ఆ సినిమాలతో ఏం సాధించాడన్నది ముఖ్యం. ఆ లెక్కన చూస్తే, క్రిష్ చాలా సాధించాడు! క్రిష్ సినిమాల్లో కథలు కనిపించవ్. వ్యథలు తప్ప. హీరోల కోసం సినిమాలు తీయడు. తన సినిమాల్లోంచే హీరోల్ని పుట్టిస్తాడు.
''అస్తమానూ ఇలాంటి సినిమాలేనా, మీరు మారరా..'' అని సామాన్య ప్రేక్షకుడు పెదవి విరిచినప్పుడల్లా - క్రిష్‌లాంటి దర్శకుడు ఒక్కడు పుట్టుకొస్తుంటాడు. మనసు తడి చేసే సినిమాలు తీస్తుంటాడు.
గమ్యం సినిమా చూసుంటారు. ఇంకోసారి మనసు పెట్టి చూడండి. ఆ రోజు నిద్ర పోరు. సన్నివేశాలు వెంటాడుతుంటాయి. అభి, జానకి పాత్రలు తరుముతుంటాయి. గాలి శీనయితే గుండెల్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటాడు. సమాజాన్ని, మనుషుల్ని, మనస్తత్వాలనీ ప్రశ్నిస్తుంటాయి. క్రిష్ పుస్తకాల్ని ఏమాత్రం చదివాడో తెలీదు గానీ, మనుషుల్ని మాత్రం చాలా చదివుంటాడు. అందుకే తన కథల్లో, మాటల్లో, సన్నివేశాల్లో మనిషితనం, మంచి తనం తాండవిస్తుంటాయ్.
డబ్బు, మనసు, ప్రేమ, శీలం, గుణం, అభ్యుదయం, అహంకారం, నక్సలిజం, వ్యభిచారం, మతం, మానవత్వం... ఇలా ఎన్నో విషయాలు. పుస్తకాల్లో నిఘూడించిన అంశాలు, అన్నీ గుదిగుచ్చి... ఓ దండలా గుచ్చి ప్రేక్షకుల మెడలో వేస్తాడు. అవన్నీ - ఆలోచనల పరిమళాలను వెదజల్లేలా చేస్తుంటాయ్. సమాజాన్ని చాలా తెలివిగా ప్రశ్నిస్తాడు క్రిష్. తన పాత్రల ద్వారా, తన సన్నివేశాల ద్వారా తాను భావాల్ని చాలా స్పష్టంగా చెప్పేస్తుంటాడు. అందుకు గమ్యం... ఓ ఉదాహరణ. గాలిశీను నుంచి వచ్చిన ప్రతీమాటా కామెడీగా తీసుకొన్నా - అందులో ఉన్న నిగూఢార్థం మనసుల్ని కెలికేస్తుంది. కేబుల్ రాజు, బీటెక్ బాబు... వీళ్లేం ఆకాశం నుంచి దిగొచ్చిన హీరోలు కాదు. మన మధ్యే, మనతోనే ఉన్నారు. కానీ మనం గుర్తించమంతే.
ఆర్ట్ సినిమా అంటే నీరసంగా, చాదస్తంగా, భారంగా గడుస్తుందన్న అపోహ ఉంది. దానికి కమర్షియల్ టచ్ ఇవ్వడం మన వల్ల కాదు అని చేతులెత్తేసినవాళ్లున్నారు. కానీ క్రిష్‌కి ఈ కలయిక సాధ్యమైంది. గమ్యం, వేదం, కృష్ణం వందే... ఇవన్నీ కమర్షియల్ సినిమాలే. చెప్పాలనుకొన్న పాయింట్ ని అందరూ మెచ్చేలా చెప్పే సీక్రెట్ క్రిష్‌కి ఎలా అబ్బిందో గానీ... కళాత్మక, విశ్లేషణాత్మక అంశాల్ని... వ్యాపార కోణంలోనూ చెప్పగలిగే దర్శకుడు అనిపించుకొన్నాడు. ''నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు'' అంటాడు తిలక్...! క్రిష్‌దీ అదే మాట. తన సినిమాలు... అపరంజిబొమ్మలట. అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా కథల్ని చెప్పాలని తహతహలాడుతుంటాడు.
ఎన్ని కమర్షియల్ సినిమాలు రానివ్వండి...
సినిమాని వ్యాపారంలో ముంచి తేల్చనివ్వండి..
మానవీయ కోణాల్ని మాస్ మసాలాలు మింగేయనివ్వండి...
మధ్య మధ్యలో క్రిష్‌లాంటి దర్శకుడొస్తాడు..
సినిమా అంటే ఇదీ... అని చాటి చెబుతాడు!!
అలాంటి ధైర్యం అందించాడు క్రిష్. తను ఇలాగే మున్ముందు కూడా మంచి సినిమాలు తీయాలని, తెలుగు సినిమా కీర్తినీ ఖ్యాతిని నలుదిశగా వ్యాపింపచేయాలని, మరెన్నో ఉదాత్తమైన పాత్రల్ని సృష్టించి, తెలుగు సినిమాకో కొత్త అర్థాన్ని ఇవ్వాలని కోరుకొందాం..
హ్యాపీబర్త్‌డే టూ క్రిష్....