English | Telugu
Kantara: కాంతారను కాపాడిన కోర్టు.. లేదంటే ఎంత నష్టమో..!
Updated : Oct 15, 2025
'కాంతార'కి ప్రీక్వెల్ గా రూపొందిన 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటిదాకా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఒక్క కర్ణాటకలోనే రూ.170 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. దీపావళి ఉండటంతో ఫుల్ రన్ లో కర్ణాటకలో రూ.200 కోట్ల మార్క్ ని కూడా టచ్ చేసే అవకాశముంది. అయితే 'కాంతార చాప్టర్ 1' ఈ ఫీట్ సాధించడం వెనుక.. పరోక్షంగా కర్ణాటక హైకోర్టు చేసిన సాయముంది. కోర్టు లేకపోతే ఈ సినిమా వసూళ్ళు కనీసం రూ.50 కోట్లు తగ్గేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Kantara Chapter 1)
సామాన్యులకు సినీ వినోదాన్ని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఓ జీవో తీసుకొచ్చింది. దాని ప్రకారం, మూవీ టికెట్ ధర రూ.200 కి మించకూడదు. ఈ నిర్ణయం భారీ బడ్జెట్ సినిమాలకు బిగ్ షాక్ లాంటిదే. అలాగే, బెంగళూరులో పలు లగ్జరీ మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. స్క్రీన్ క్వాలిటీ, అక్కడి వసతులను బట్టి.. వాటిలో రూ.500 నుంచి రూ.2000 వరకు ఒక్కో టికెట్ ధర ఉంటాయి. అలాంటిది టికెట్ ధరను రూ.200 కి తగ్గిస్తే, తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదనేది మల్టీప్లెక్స్ యాజమాన్యాల వాదన. ఈ క్రమంలోనే 'కాంతార' సహా పలు భారీ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్, అలాగే మల్టీప్లెక్స్ అసోసియేషన్ కోర్టుని ఆశ్రయించాయి. ఇదంతా 'కాంతార చాప్టర్ 1' విడుదలకు ముందు జరిగిన తతంగం.
నిర్మాతలు, మల్టీప్లెక్స్ యాజమాన్యాల వాదనలు విన్న హైకోర్టు.. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై స్టే విధించింది. దీంతో 'కాంతార చాప్టర్ 1' కర్ణాటకలో మునుపటి టికెట్ ధరలతోనే విడుదలైంది. ఒకవేళ కోర్టు.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లయితే.. మల్టీప్లెక్స్ లలో కూడా రూ.200 టికెట్ ధరతో కాంతార విడుదలై ఉండేది. అదే జరిగి ఉంటే.. వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేది. ఎంత ఫుట్ ఫాల్స్ పెరిగినా కర్ణాటకలో ఇప్పుడొచ్చిన రూ.170 కోట్ల గ్రాస్ అసలు సాధ్యమయ్యేది కాదని, కనీసం రూ.50 కోట్లకు గండి పడేదని అంటున్నారు. ఆ పరంగా చూస్తే, కర్ణాటక హైకోర్టు కాంతారకు ఎంతో మేలు చేసినట్టే లెక్క.
టికెట్ ధరల జీవో అంశం ఇంకా కోర్టులోనే ఉంది. దీనిపై బలంగా వాదనలు వినిపించడానికి కర్ణాటక సర్కార్ సిద్ధమవుతోంది. ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే మాత్రం.. భవిష్యత్ లో విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు నష్టం జరిగే అవకాశముంది. ఏది ఏమైనా ఈ విషయంలో 'కాంతార చాప్టర్ 1' సేవ్ అయిందని చెప్పవచ్చు.