English | Telugu
మెగా సామ్రాజ్యానికి పునాది పడిన రోజు!
Updated : Feb 11, 2026
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మొదటిసారి తెరపై కనిపించిన చిత్రం 'ప్రాణం ఖరీదు'. అయితే చిరంజీవి మొదటిసారి కెమెరా ముందు నిలిచి నటించిన చిత్రం మాత్రం 'పునాదిరాళ్లు'(Punadhirallu). చిరంజీవి ముఖానికి రంగు వేసుకొని, తొలిసారి నటించి 48 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా చిరంజీవి.. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
"ఈరోజు పునాదిరాళ్లు సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.
ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది.
ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.
ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు." అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా పునాదిరాళ్లు సమయంలో దిగిన కొన్ని ఫోటోలను కూడా చిరంజీవి పంచుకున్నారు. అందులో యంగ్ చిరంజీవి లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.