English | Telugu
'బడ్డీ' మూవీ రివ్యూ
Updated : Aug 2, 2024
తదితరులు: అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ తదితరులు
దర్శకుడు: శామ్ ఆంటోన్
నిర్మాత: జ్ఞానవేల్ రాజా
విడుదల తేదీ: ఆగస్టు 2, 2024
సెలక్టివ్ గా సినిమాలు చేసే అల్లు శిరీష్ రెండేళ్ల తర్వాత 'బడ్డీ' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ మూవీ 'టెడ్డీ' కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Buddy Review)
కథ:
పైలెట్ గా పనిచేసే ఆదిత్య (అల్లు శిరీష్).. విధి నిర్వహణలో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తో తరచూ మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలో అక్కడ పనిచేసే పల్లవి (గాయత్రీ భరద్వాజ్)తో మాటలు కలుస్తాయి. ఒకరినొకరు చూసుకోకుండానే ఒకరిపై ఒకరు మనసు పారేసుకుంటారు. కరెక్ట్ టైం చూసి, ఆదిత్యతో తన ప్రేమ విషయాన్ని చెప్పాలని పల్లవి అనుకుంటుంది. కానీ పల్లవి చేసిన ఒక పొరపాటు వల్ల ఆదిత్య ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. దాంతో ఆదిత్యను నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది పల్లవి. కానీ ఇంతలోనే ఆమె కిడ్నాప్ అవుతుంది. ఈ క్రమంలో జరిగిన ఘటనలో పల్లవి కోమాలోకి వెళ్తుంది. ఆమె ఆత్మ ఓ టెడ్డీబేర్ లోకి ప్రవేశిస్తుంది. బ్రతికుండగానే ఆత్మ బయటకు రావడమేంటి? అసలు పల్లవిని కిడ్నాప్ చేసిందెవరు? ఆమె కిడ్నాప్ కి, హాంకాంగ్‌లో ఉన్న అర్జున్ కుమార్ వర్మ (అజ్మల్)కి సంబంధమేంటి? టెడ్డీ ఆదిత్య దగ్గరకు ఎలా వచ్చింది? చివరికి పల్లవి, ఆదిత్య కలిసారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
కోమాలో ఉన్న హీరోయిన్ ఆత్మ బయటకు రావడం అనేది ఇప్పటికే 'ఎందుకంటే ప్రేమంట' సినిమాలో చూసేసాం. కానీ ఇందులో హీరోయిన్ ఆత్మ ఒక టెడ్డీలో ప్రవేశిస్తుంది. అదే కొత్త పాయింట్. కానీ తమిళ మూవీ 'టెడ్డీ' చూసినవారికి ఇది కూడా కొత్త పాయింట్ కాదు. కాబట్టి ఇది ప్రేక్షకులకు తెలిసిన కథ కిందే లెక్క. ఇలాంటి తెలిసిన స్టోరీని తీసుకున్నప్పుడు.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించాలి. లేదంటే చూసే ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. 'బడ్డీ' విషయంలో కూడా ఇంచుమించు అదే జరిగింది.
హీరోయిన్ ఆత్మ ప్రవేశించిన టెడ్డీతో కలిసి.. అవయవాల అక్రమ రవాణా చేస్తున్న ముఠాకి హీరో ఎలా చెక్ పెట్టాడు అనేదే ఈ చిత్ర కథ. హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు డాక్టర్ అర్జున్ గా అజ్మల్ పాత్ర పరిచయంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. హీరో, హీరోయిన్ చేసుకోకుండానే ఇష్టపడటం.. హీరోయిన్ ఆత్మ టెడ్డీలోకి ప్రవేశించడం చకచకా జరిగిపోతాయి. కానీ అక్కడి నుంచి కథనం నెమ్మదిగా సాగుతుంది. టెడ్డీ చేసే కామెడీ మాత్రమే అక్కడక్కడా అలరిస్తుంది. అది కూడా పిల్లలకు ఎక్కువగా నచ్చుతుంది. యాకాశం సన్నివేశాలు పరవాలేదు. విరామ సన్నివేశాలు మెప్పించాయి. సెకండాఫ్ తేలిపోయింది. కథనం నెమ్మదిగా సాగింది. కొన్ని సీన్స్ లాజిక్ లెస్ గా ఉన్నాయి. హీరో, టెడ్డీ మధ్య ఎమోషన్ ని బలంగా చూపించి.. స్క్రీన్ ప్లేని గ్రిప్పింగ్ రాసుకుంటే అవుట్ పుట్ మెరుగ్గా ఉండేది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
శిరీష్ పోషించిన ఆదిత్య పాత్రలో పెద్దగా మెరుపుల్లేవు. సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. గాయత్రీ భరద్వాజ్ ఉన్నంతలో తన మార్క్ చూపించింది. అజ్మల్ ఇంకా పవర్ ఫుల్ గా ఉంటే బాగుండేది.
హిప్ హాప్ తమిళ సంగీతం పరవాలేదు. కృష్ణన్ వసంత్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. రూబెన్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. వీఎఫ్ఎక్స్ వర్క్ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా..
కొన్ని నవ్వులు తప్ప.. పెద్దగా మెరుపుల్లేవు. టెడ్డీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా పిల్లలకి నచ్చే అవకాశముంది.
రేటింగ్: 2.5/5