English | Telugu
మెగా సర్ ప్రైజ్.. 'భోళా శంకర్' టీజర్ వచ్చేస్తోంది!
Updated : Jun 22, 2023
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రధారిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా రెండు నెలలు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది.
'భోళా శంకర్' నుంచి ఇప్పటికే పలు పోస్టర్లు విడుదల కాగా, చిరంజీవి లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్లలో ఆయన ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక భోళా మేనియా పేరుతో ఇటీవల ఫస్ట్ సాంగ్ ని విడుదల చేశారు. ఇప్పుడదే జోష్ లో టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారు. 'భోళా శంకర్' టీజర్ ని జూన్ 24న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మెగాస్టార్ ని మెహర్ రమేష్ ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఈ ఏడాది ఇప్పటికే యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.
తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
