English | Telugu

`త్రిమూర్తులు`గా వెంకీ, అర్జున్, రాజేంద్ర‌ప్ర‌సాద్ అల‌రించి నేటికి 35 ఏళ్ళు!

తెలుగునాట మ‌ల్టిస్టార‌ర్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన అగ్ర క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేశ్ ఒక‌రు. కెరీర్ ఆరంభంలో ఆయ‌న చేసిన మ‌ల్టిస్టార‌ర్స్ లో `త్రిమూర్తులు` ఒక‌టి. హిందీ చిత్రం `న‌సీబ్` (1981) ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో వెంకటేశ్ తో పాటు యాక్షన్ కింగ్ అర్జున్, న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ క‌థానాయ‌కులుగా న‌టించారు. శోభ‌న‌, ఖుష్బూ, అశ్వ‌ని నాయిక‌లుగా సందడి చేసిన ఈ చిత్రంలో రావు గోపాల రావు, స‌త్యనారాయ‌ణ‌, అల్లు రామ‌లింగ‌య్య‌, నూత‌న్ ప్ర‌సాద్, అనుప‌మ్ ఖేర్, న‌గేశ్, సుమిత్ర ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ఎంట‌ర్టైన్ చేశారు.

``ఒకే మాట ఒకే బాట‌`` అంటూ సాగే గీతంలో కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, చంద్ర‌మోహ‌న్, ముర‌ళీ మోహ‌న్, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్, గొల్ల‌పూడి మారుతీరావు, ప‌ద్మ‌నాభం, ఎ. కోదండ‌రామిరెడ్డి, కోడి రామ‌కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల‌, శార‌ద‌, రాధిక‌, విజ‌య‌శాంతి, రాధ‌, భానుప్రియ‌, జ‌య‌మాలిని, అనూరాధ‌, వై. విజ‌య వంటి సినీ ప్ర‌ముఖులు అతిథులుగా మెరిసి.. సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

బ‌ప్పీల‌హ‌రి బాణీలు క‌ట్టిన ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ‌, వేటూరి సాహిత్య‌మందించారు. ఇందులోని ``ఒకే మాట‌``, ``అయ్య‌య్యో``, ``మంగ్చావ్``, ``శీతాకాలం``, ``ఈ జీవితం``, ``బై బై బై``.. అంటూ మొద‌ల‌య్యే పాట‌ల‌న్నీ ఆక‌ట్టుకున్నాయి. మ‌హేశ్వ‌రి ప‌ర‌మేశ్వ‌రి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై కె. ముర‌ళీ మోహ‌న రావు ద‌ర్శ‌క‌త్వంలో టి. సుబ్బ‌రామి రెడ్డి నిర్మించిన `త్రిమూర్తులు`.. 1987 జూన్ 24న జ‌నం ముందుకు వ‌చ్చింది. కాగా, నేటితో ఈ చిత్రం 35 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.