English | Telugu
20 ఏళ్ళ 'నీ ప్రేమకై'!
Updated : Mar 1, 2022
'ప్రేమ దేశం' (1996) వంటి సంచలన చిత్రం తరువాత అబ్బాస్, వినీత్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా `నీ ప్రేమకై` (2002). మూవీ మొఘల్ డి. రామానాయుడు నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాకి ముప్పలనేని శివ దర్శకత్వం వహించారు. `తాజ్ మహల్` (1995) వంటి మెమరబుల్ మూవీ తరువాత రామానాయుడు, ముప్పలనేని కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో లయ ఓ కథానాయికగా నటించింది. మరో నాయికగా నటించిన సోనియా అగర్వాల్ కి ఇదే మొదటి సినిమా కావడం విశేషం.
రామానాయుడు, కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్, బ్రహ్మానందం, సుధాకర్, ఏవీయస్, అలీ, ఎమ్మెస్ నారాయణ, మనోరమ, కవిత, సన, అనితా చౌదరి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈ చిత్రానికి ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన బాణీలు ప్రధాన బలంగా నిలిచాయి. ``వెండి మబ్బుల పల్లకిలో``, ``ఓ ప్రేమ స్వాగతం``, ``మందాకిని మందాకిని``, ``కలలు కన్న నీకై``, ``కోటి తారల``, ``మనసన్నదే లేదు``.. ఇలా ఇందులోని పాటలన్నీ రంజింపజేశాయి.
`బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్` (ముప్పలనేని శివ) విభాగంలో `నంది` పురస్కారం అందుకున్న ఈ చిత్రానికి వి. జయరామ్ ఛాయాగ్రహణం అందించారు. 2002 మార్చి 1న విడుదలైన `నీ ప్రేమకై`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.