English | Telugu
మ్యూజికల్ హిట్ `నేనున్నాను`కి 18 ఏళ్ళు!
Updated : Apr 7, 2022
కింగ్ నాగార్జున - స్వరవాణి కీరవాణి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ గా మెప్పించాయి. వాటిలో `నేనున్నాను` ఒకటి. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ్ కి జోడీగా శ్రియ, ఆర్తి అగర్వాల్ నటించారు. ముకేశ్ రిషి, సుబ్బరాజు, పశుపతి, సునీల్, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ళ భరణి, పరుచూరి వెంకటేశ్వరరావు, సుధ, శివపార్వతి, రవి బాబు, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, శివా రెడ్డి, మాస్టర్ ఆనంద్ వర్థన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చిన ఈ చిత్రంలో `నువ్వు నేను` ఫేమ్ అనిత ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది. ప్రేమ వ్యవహారం కారణంగా అందరు ఉన్నా ఒంటరైపోయిన అను (శ్రియ)కి నేనున్నాంటూ చేయూతనిచ్చిన వేణు (నాగ్) అనే ఓ అనాథ కథే.. ఈ సినిమా.
`సిరివెన్నెల` సీతారామశాస్త్రి, చంద్రబోస్ కలం నుంచి జాలు వారిన పాటల్లో ``ఏ శ్వాసలో చేరితే``, ``నీ కోసం నీ కోసం``, ``నేనున్నానని``, ``ఎట్టాగో ఉన్నాది``, ``నూజివీడు``, ``ఇంత దూరమొచ్చాక``, ``ర్యాలీ రావులపాడు``.. ఇలా అన్ని గీతాలు కూడా సంగీత ప్రియులను రంజింపజేశాయి. కామాక్షి మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన `నేనున్నాను`.. 2004 ఏప్రిల్ 7న విడుదలై 125 కేంద్రాలలో 50 రోజులు, 42 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమైంది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ 18 వసంతాలు పూర్తిచేసుకుంది.