English | Telugu
RRR రూ. 1000 కోట్ల పార్టీ.. సీక్వెల్‌పై పెద్ద హింట్ ఇచ్చిన తారక్!
Updated : Apr 7, 2022
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి డైరెక్ట్ చేసిన మాగ్నమ్ ఓపస్ RRR విడుదలైన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర ఒకదాని తర్వాత ఒకటిగా రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వస్తోంది. ఇటు ఇండియాలోనూ, అటు ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి 2' పేరిట ఉన్న ఫస్ట్ డే కలెక్షన్ రికార్డును RRR బద్దలు కొట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 228.50 కోట్ల గ్రాస్ సాధించి, ఆ క్రమంలో పలు రికార్డులను బ్రేక్ చేసిన ఆ సినిమా మొదటి వారం అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. రెండో వారాంతం కూడా ఊహించిన దానికి మించి వసూళ్లను సాధించిన ఆ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల గ్రాస్‌కు చేరువైంది.
ఈ నేపథ్యంలో RRR రూ. 1000 కోట్ల సక్సెస్ పార్టీ ముంబై శాంతాక్రుజ్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రతిష్ఠాత్మక సహారా స్టార్ హోటల్‌లో బుధవారం రాత్రి చాలా గ్రాండ్‌గా జరిగింది. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, డీవీవీ దానయ్య, హిందీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ అధినేత జయంతీలాల్ గడా ఈ పార్టీకి ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు ఇంటరాక్ట్ అయ్యారు. మీడియా వారు సంధించిన ప్రశ్నల్లో RRR సీక్వెల్ వస్తుందా అనేది కూడా ఒకటి. క్లైమాక్స్ చూసిన వాళ్లకు సీక్వెల్‌కు స్కోప్ ఉంటుందని అనిపించడం సహజం.
RRR కారణంగా తారక్, చరణ్ ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ తెచ్చుకున్నారనీ, సీక్వెల్ చేసి తమను మరోసారి ఎంటర్‌టైన్ చేసే దాకా వారు ఊరుకొనేటట్లు లేరనీ రాజమౌళి సరదాగా అంటే, RRR ఎలా ముగిసిందో అందరూ చూశారనీ, వారంతా సీక్వెల్ కావాలని కోరుకుంటున్నారనీ తారక్ చెప్పాడు. సీక్వెల్ చేయకపోతే రాజమౌళిని చంపేసేటట్లు ఉన్నారని కూడా అన్నాడు. RRRకి కచ్చితంగా సీక్వెల్ వస్తుందని అనుకుంటున్నట్లు అతను చెప్పాడు. దీన్ని బట్టి RRRకు సీక్వెల్ రావడం ఖాయమంటారా?