English | Telugu
సినీ వేడుకలో విప్లవకారుడికి ఘోర అవమానం
Updated : Sep 23, 2013
భారతీయ సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చెన్నైలో వందేళ్ళ భారతీయ సినిమా వేడుకలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఆదివారం జరిగిన వేడుకలో సాయంత్రం ప్రముఖనటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి చాలా ఉద్వేగంగా మాట్లాడారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు బాలచందర్‌ని తెలుగు చలనచిత్ర సీమ సన్మానించడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సంధర్భంగా ఆర్. నారాయణమూర్తి ప్రసంగిస్తూ.... ''ఎంతో గౌరవంగా, పద్దతిగా జరుపుకోవలసిన ఈ వేడుకను ఇలా ఐటెం సాంగ్స్‌తో చాలా చీప్‌గా నిర్వహిస్తున్నారు. ఇది చూడటానికి వందేళ్ళ వేడుకలా లేదు... ఇదేదో సినిమా ఆడియో వేడుకలా వుంది. ఈ వేడుకలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి దాసరి నారాయణ రావు, కళా తపస్వి కె. విశ్వనాద్, రాఘవేంద్రరావు, రామానాయుడు వంటి చిత్ర ప్రముఖులు ఎందరో వుండగా వారికి కాకుండా తమిళ దర్శకుడు బాలచందర్‌కు అగ్రస్థానం ఇచ్చి సన్మానించటం నిజంగా మన దౌర్భాగ్యం. బాలచందర్ గొప్ప మేధావే కానీ...మనవారిని కూడా మనం గౌరవించుకునే సంస్కారం మనకు వుండాలి కదా'' అంటూ ఆవేశంగా ప్రసంగించారు.
అయితే ఆయన అన్న మాటలకు ఖంగుతిన్న అక్కడే ఉన్న దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ వెంటనే వేదికపైకి వచ్చి, నారాయణమూర్తి చేతిలో వున్న మైకు లాగేసుకుని, ఆయనకు మరోమాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బలవంతంగా కిందికి పంపేశారు. ఈ విధంగా ఈ వేడుకలో ఇలాంటి ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన నారాయణమూర్తికి అవమానం జరిగింది.