English | Telugu

యార్లగడ్డకు వైసీపీ నేతల బుజ్జగింపులు... ఎమ్మెల్సీ ఇస్తామంటూ జగన్ ఆఫర్..!

వల్లభనేని వంశీ ఎపిసోడ్ తో గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణుల్లోనూ.... అటు వైసీపీ వర్గాల్లోనూ రగడ జరుగుతోంది. ఇరుపార్టీల్లోనూ సమాలోచనలు, బుజ్జగింపులు, ఆందోళనలు, ఆగ్రహావేశాలు చోటు చేసుకుంటున్నాయి. వల్లభనేనిని నిలుపుదల చేసేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే... మరోవైపు వంశీ రాకను యార్లగడ్డ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాంతో అటు టీడీపీ... ఇటు వైసీపీ... రెండు పార్టీల్లో వంశీ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తోంది.

ఇదిలా ఉంటే, వంశీ ఎపిసోడ్ పై కృష్ణాజిల్లా టీడీపీ నేతలతో సుదీర్ఘంగా సమావేశమైన చంద్రబాబు... వల్లభనేని రాసిన లేఖలపై చర్చించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బచ్చలు అర్జునుడు... తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. అయితే, వివిధ కారణాలు చెబుతూ తెలివిగా లేఖలు రాసిన వంశీ.... వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయానికి టీడీపీ నేతలు వచ్చారు. అయితే, వంశీ కోసం కేశినేని నాని, కొనకళ్ల నారాయణను రంగంలోకి దింపినా... అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న వంశీ... విజయవాడ వచ్చాక కలుస్తానని కేశినేని నానికి సమాచారం ఇచ్చారని టీడీపీ లీడర్లు చెబుతున్నారు. అయితే, వల్లభనేని వంశీపై దేవినేని ఉమా ఫైరయ్యారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయకుండా... ఏ డ్రామా ఏంటంటూ విరుచుకుపడ్డారు.

టీడీపీలో పరిణామాలు ఇలాగుంటే, గన్నవరం వైసీపీలోనూ వంశీ ప్రకంపనలు రేగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో నువ్వానేనా అంటూ తలపడి స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు... వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, యార్లగడ్డ అసంతృప్తిని గమనించిన జగన్మోహన్ రెడ్డి.... మంత్రుల ద్వారా ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ వంశీతో తనకున్న విభేదాల దృష్ట్యా ఎమ్మెల్సీ ఆఫర్ ను యార్లగడ్డ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో, ఒకవేళ గన్నవరంలో ఉపఎన్నిక వస్తే... టీడీపీ నుంచి యార్లగడ్డ... వైసీపీ నుంచి వంశీ పోటీపడినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. మరి గన్నవరం రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.