English | Telugu
ఇప్పుడాయన ఏజెంట్ 116...
Updated : Apr 15, 2020
*నిమ్మగడ్డ ఫోర్జరీ వ్యవహారం లో కనకమేడల, వర్ల రామయ్య, టీ డీ జనార్దన్ ఉన్నారంటూ డి జి పి కి ఫిర్యాదు
*నిమ్మగడ్డ సంతకం తెలుగుదేశం పార్టీ ఆఫీసు లోనే ఫోర్జరీ అయిందని విజయసాయి ఆరోపణ
* ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించాలంటూ డి జి పి కి వినతి
నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంక్షోభం , మొత్తానికి తెలుగుదేశం పార్టీని ఇంకా వెన్నాడుతూనే ఉంది. సి ఐ డి ఆఫీసర్ గా అవతారమెత్తిన వై ఎస్ ఆర్ సి పి జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయి రెడ్డి తాజాగా తన పరిశోధనలో కొత్త అంశాలను వెలికి తీశారు.
కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖపై విచారణ జరిపించాలని కోరుతూ, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, డి జి పి గౌతమ్ సవాంగ్ కు తాజాగా లేఖ రాయడంతో, ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ఇటీవల, కేంద్ర హోం శాఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్టుగా వెలుగు చూసిన ఒక లేఖ, సంచలనం రేపిన విషయం తెలిసిందే.
దీనిపై తాజాగా, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా రమేష్ కుమార్ చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతనే లేదని అనుమానం వ్యక్తం చేశారు.
సంతకం ఫోర్జరీ చేసిన లేఖ కచ్చితంగా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో తయారైందని తమ దగ్గర సమాచారం ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేశారని, ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఆ పార్టీ నాయకులు వర్ల రామయ్య, టీడీ జనార్ధన్‌ల హస్తం ఉందని వెల్లడించారు. వీరంతా కలిసే ఈ లేఖను సృష్టించారని, ఈ తతంగమంతా రమేష్ కుమార్‌కు తెలిసే జరిగిందని విమర్శించారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాలని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని, దీనిపై వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా వెల్లడించారు. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు.