English | Telugu

అక్కడ ట్రంప్.. ఇక్కడ జగన్! వింత, వితండవాదులన్న యనుమల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీరుతో పోల్చారు టీడీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు. అమెరికా రాజ్యాంగానికి విరుద్ధంగా ట్రంప్ వ్యవహార శైలి ఉందని, ఇక్కడ ఏపీలో భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనా తీరు అలాగే ఉందని విమర్శించారు. ఎస్‌ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు యనుమల. ట్రంప్ తరహాలోనే జగన్ వ్యవహారం ఉందని ఆరోపించారు. ఏ అధికారంతో సీఎస్ ఎన్నికల సంఘాన్ని ధిక్కరిస్తున్నారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు యనమల రామకృష్ణుడు. స్థానిక ఎన్నికలపై వైసీపీ ప్రభుత్వ వాదన విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించమంటే చెప్పింది చేయమని కాదని చెప్పారు. ఇటువంటి ముఖ్యమంత్రిని, వింత పార్టీని, వితండ ప్రభుత్వాన్ని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు యనుమల. కోర్టుల ఆదేశాలను కూడా సిఎం జగన్ రెడ్డి అమలు చేయరని విమర్శించారు. స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘాన్ని కూడా పనిచేయకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్రంలో నెపోటిజం, ఫేవరిటిజం తప్ప మరేమీలేదన్నారు.