English | Telugu
ఎన్నికల విధుల నుంచి టీచర్లు అవుట్! ఇదే తొలిసారంటున్న ఉద్యోగులు
Updated : Nov 20, 2020
మున్సిపల్ శాఖ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల విధులను ఎక్కువగా టీచర్లే నిర్వహిస్తారు. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీచర్లే పోలింగ్ తో పాటు కౌంటింగ్ విధులు చేశారు. ఎన్నికల ప్రిసెడింగ్ అధికారులు, పోలింగ్ కేంద్రం ఇంచార్జ్ లుగా టీచర్లనే నియమించేవారు. గతంలో చాలా సార్లు ఎన్నికల డ్యూటీలు చేసి ఉన్నారు కాబట్టి వారికి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నిక జరపాలని చూస్తుండటం వింతగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదంటున్నారు. టీచర్లు లేకుండా ఇతర ఉద్యోగులతో ఎన్నికల ప్రక్రియ జరగడం వినడానికే వింతగా ఉందనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మిగితా ఉద్యోలకంటే టీచర్లు కేసీఆర్ సర్కార్ తీరుపై మరింత కోపంగా ఉన్నారని చెబుతున్నారు. పీఆర్సీ పెండింగ్, వాయిదాల్లో జీతాలు, బదిలీలు, ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. టీచర్లంతా ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని ఇంటలిజెన్స్ రిపోర్టులు కూడా సీఎం కేసీఆర్ కు వచ్చాయంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఉపాద్యాయులు బీజేపీకి సపోర్ట్ చేశారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. దీంతో టీచర్లు పోలింగ్ విధుల్లో ఉంటే తమకు వ్యతిరేకంగా పనిచేయవచ్చనే భయం అధికార పార్టీలో ఉందనే చర్చ జరుగుతోంది. అందుకే గ్రేటర్ ఎన్నికల విధుల నుంచి టీచర్లను దూరం పెడుతున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.